పిడుగులతో భారీ వర్షాలు- ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక వైపు వడగాల్పుల తో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అదే సమయంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇదే సమయంలో ఉష్ణోగ్రతల తీవ్రత పెరగనుంది. దీంతో, పలు జిల్లాలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ద్రోణి ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు ఆగ్నేయ రాజస్థాన్, పొరుగు ప్రాంతాలపై నున్న ఉపరితల ఆవర్తనం నుండి గుజరాత్, మహారాష్ట్ర, అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతా వరణం శాఖ పేర్కొంది. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

ఈ జిల్లాల్లో పిడుగులతోపాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అలర్ట్ జారీ చేసింది. ఇటు, తెలంగాణలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏడు ఉమ్మడి జిల్లాల్లో 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ద్రోణి కారణంగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. దీంతో, ఉదయం వేళ వేడి తీవ్రత.. సాయంత్రం సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఫలితంగా శనివారం, ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది.












Click it and Unblock the Notifications