అయోధ్య, వారణాసితో సహా 30 క్షేత్రాలు, 17 రోజులు- భారత్ గౌరవ్ స్పెషల్, ధరలు..!!
ఐఆర్సీటీసీ మరో ఆధ్యాత్మిక ప్యాకేజీ ప్రకటించింది. ఈ మధ్య కాలంలో ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలకు ఆదరణ పెరుగుతోంది. దీంతో, రెగ్యులర్ ట్రైన్స్ లో రద్దీ ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాల ను కలుపుతూ ప్రత్యేక ప్యాకేజీగా ప్రకటిస్తోంది. తాజాగా 17 రోజులు పాటు 30 ప్రముఖ ఆలయాల సందర్శనకు వీలుగా ఐఆర్సీటీసీ ప్యాకేజీ ప్రకటించింది. ఈ స్పెషల్ ప్యాకేజీలు దర్శించే స్థలాలు.. షెడ్యూల్.. ధరలను వెల్లడించింది.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఈసారి రాముడికి సంబంధించిన 30 కి పైగా క్షేత్రాల సందర్శనకు వీలుగా మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. జూలై 25, 2025 నుంచి ఆరంభం కానున్న శ్రీ రామాయణ రైలు యాత్రలో భాగంగా భక్తులు.. 17 రోజుల పాటు ఢిల్లీ నుంచి రామేశ్వరం వరకూ ఉన్న వివిధ రామక్షేత్రాలను దర్శించుకునేలా షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ మేరకు జులై 25, 2025 నుంచి ఐదవ 'శ్రీ రామాయణ యాత్ర' డీలక్స్ రైలు పర్యటనను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఆధునిక సౌకర్యాలతో భారత్ గౌరవ్ డీలక్స్ AC టూరిస్ట్ రైలు ఈ యాత్రను నిర్వహిస్తుంది.

ఇది పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ (AC) రైలు. దీనిలో మూడు రకాల సీటింగ్‌లు అందుబాటులో ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ AC కోచెస్ ఉంటాయి. ప్రతి కోచ్‌లో CCTV కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు ఉంటారు. ప్యాకేజీలో భాగంగా భోజనాలు, 3-స్టార్ వసతి, ప్రయాణ బీమాతో సహా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.ప్యాకేజీ ధర రూ. 1.17 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ ప్రయాణం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ స్టేషన్ నుంచి ప్రారంభమై అయోధ్య, నందిగ్రామ్, సీతామర్హి, జనక్‌పూర్ (నేపాల్), బక్సర్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, నాసిక్, హంపి, రామేశ్వరం తదితర ప్రాంతాల్లో రాముడికి సంబంధించిన 30 కి పైగా పుణ్యక్షేత్రాలను 17 రోజుల్లో కవర్ చేస్తారు. ఈ ప్రయాణం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమవుతుంది. మొదటి గమ్యస్థానం అయోధ్య చేరుకోనుంది.
అయోధ్యలో ప్రయాణికులు శ్రీ రామ జన్మభూమి ఆలయం, హనుమాన్ గర్హి, రామ్ కీ పైడి (సరయూ ఘాట్) సందర్శిస్తారు. దీని తర్వాత నందిగ్రామ్‌లో భారత్ మందిర్ దర్శనం ఉటుంది. నేపాల్‌లోని సీతామర్హి, జనక్‌పూర్‌లలో సీతాదేవి జన్మించిన ప్రదేశం, జానకిరాముని ఆలయం సందర్శనకు ప్లాన్ చేసారు. బక్సర్‌లో రామరేఖ ఘాట్, రామేశ్వరనాథ్ ఆలయం లిస్టులో ఉన్నాయి. వారణాసిలో కాశీ విశ్వనాథ దేవాలయం, తులసి దేవాలయం, సంకట్ మోచన్ హనుమాన్ దేవాలయం, గంగా ఆరతిని సందర్శిస్తారు. అనంతరం ప్రయాగ్‌రాజ్, శృంగవేర్‌పూర్, చిత్రకూట్ వంటి ప్రదేశాలను చూసి రాత్రికి అక్కడే బస చేస్తారు. ఉదయాన్నే నాసిక్ చేరుకుని త్రయంబకేశ్వరాలయం, పంచ వటి సందర్శించేలా ఈ ప్యాకేజీ ఖరారు చేసారు. హంపిలో ఆంజనేయ కొండ (హనుమంతుడు జన్మించిన ప్రదేశం), విఠల ఆలయం, విరూపాక్ష ఆలయం చూస్తారు. చివరగా రామేశ్వరంలోని రామనాథస్వామి దేవాలయం, ధనుష్కోడి సందర్శిస్తారు.












Click it and Unblock the Notifications