బాబును కార్నర్ చేసేందుకు బీజేపీ చక్రం: ఆ భేటీ తర్వాత పవన్...?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఏపీలో ఎదిగేందుకు భారతీయ జనతా పార్టీ స్కెచ్ వేస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీకి చేసే ప్రతి సాయం క్రెడిట్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వెళ్లకుండా.. తమ ఖాతాలో పడేలా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోందనే వాదనలు వినిపిస్తున్నాయ. అందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కమలం పార్టీ ఉపయోగించుకుంటోందంటున్నారు.
మోడీ, పవన్ మధ్య బలం మరింత బలపడనుందని చెబుతున్నారు. పబ్లిక్‌లో మంచి ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్‌ను ముందు పెట్టి ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ కీలకంగా ఎదగాలని చూస్తోందని అంటున్నారు. విభజన నేపథ్యంలో.. ఏపీకి సాయం చేసే విషయంలోను బీజేపీ వ్యూహాత్ంక అడుగులు వేస్తోందని అంటున్నారు. ఏపీకి సాయం చేయాలనే ఉద్దేశ్యం ఉన్నప్పటికీ.. అది చంద్రబాబు ఖాతాలోకి వెళ్లకుండా.. బీజేపీ ఖాతాలోకి వెళ్లేలా ప్రణాళికలు చేస్తోందని అంటున్నారు.

ఇందుకు పవన్‌ను పావుగా ఉపయోగించుకోనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నారనే విషయం తెలిసిందే. రాజధాని భూముల విషయమై రైతుల కోసం మాట్లాడినట్లుగా... పవన్ ఏపీకి ఆర్థిక సాయం పైన కేంద్రంతో చర్చించనున్నారని అంటున్నారు. ఆయన స్వయంగా ప్రధాని మోడీతో త్వరలో భేటీ అవుతారని, ఇదంతా బీజేపీ వ్యూహాంలో భాగం కాకుండా పోదని అంటున్నారు. పవన్ ఢిల్లీ వెళ్తారని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
మోడీతో భేటీ తర్వాత ఏపీకి కేంద్రం భారీ ఆర్థిక సాయం ప్రకటన చేస్తుందని, తద్వారా మైలేజ్ పవన్ కళ్యాణ్, బీజేపీకి వస్తుందని, చంద్రబాబును కార్నర్ చేసినట్లవుతుందని కమలం పార్టీ భావిస్తోందని అంటున్నారు. మొత్తానికి ఏపీకి ఏం సాయం చేయాలన్నా ఆ మైలేజ్ బీజేపీకి వచ్చేలా పక్కా ప్రణాళికతో బీజేపీ ప్రణాళికలు రచిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటన పవన్ స్వయంగా చేసే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications