మోడీ ఎఫెక్ట్: ఒత్తిడిలో చిరంజీవి, బాలకృష్ణపై నొక్కి మరీ
హైదరాబాద్/విజయవాడ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి ఒత్తిడిలో ఉన్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. శనివారం విజయవాడలో పాత్రికేయిల సమావేశం ఏర్పాటు చేసిన చిరంజీవి గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పైన దుమ్మెత్తి పోశారు. తన ప్రచారంలో మోడీ పైన చిరు నిప్పులు చెరుగుతూనే ఉన్నారు.
అయితే, పాత్రికేయుల సమావేశంలో సాయంత్రం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. అంతకుముందు ఆయన కృష్ణా జిల్లాలో పర్యటిస్తూ... మోడీని హిట్లర్, క్రూరుడు అంటూ మండిపడ్డారు. దీంతో పలువురు బిజెపి మద్దతుదారులు ఆయన పైన కోడిగుడ్లతో దాడి చేశారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మోడీని టార్గెట్ చేశారు. చిరు పైన 'గుడ్డు' ప్రభావం బాగా పడిందనే సెటైర్లు వినిపిస్తున్నాయి.

స్వయంగా తన సోదరుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బిజెపికి మద్దతివ్వడం, సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటం వంటి అంశాలు ఇప్పటికే చిరును ఒత్తిడిలోకి నెట్టాయని అంటున్నారు. మోడీ ప్రమాదకర వ్యక్తి అని, బిజెపి పార్టీని మించి ఆయన ఎదిగారని చిరు నిప్పులు చెరిగారు. విలేకరులతో మాట్లాడుతూ... మోడీ అంటూ.. చూశారా బిజెపికి కాకుండా మోడీ అని వస్తుందని, అంతలా ఆయన పార్టీని మించిపోయారని విమర్శించారు. బిజెపిని మోడీ కబ్జా చేశారన్నారు.
అదే సమయంలో చంద్రబాబు పైనా నిప్పులు చెరిగారు. టిడిపిలో సామాజిక న్యాయం లేదని, ముస్లింకు ప్రాధాన్యత లేదని అభిప్రాయపడ్డారు. హిందూపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి తన బావమరిది బాలకృష్ణకు టిక్కెట్ ఇచ్చారని చిరంజీవి నొక్కి మరీ చెప్పారు. చంద్రబాబు వెనుక కార్పోరేట్ శక్తలున్నాయని ఆరోపించారు. కాగా, చిరంజీవి ఒత్తిడితోనే అసహనంగా మాట్లాడుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.












Click it and Unblock the Notifications