లీకులు: కిరణ్ సిక్సర్ కొట్టారా, టి నేతలకు షాకిచ్చారా?
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిజంగానే సిక్సర్ కొట్టారా? తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులను బోల్తా కొట్టించి తన నోటీసు పైన ఓటింగ్ జరిగి నెగ్గించుకున్నారా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ నిమిషాల్లో ఓటింగ్ ముగించారంటున్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రపతిని మరో మూడు వారాల గడువు కోరారని, మధ్యాహ్నం వరకు ఎదురు చూస్తామని ఉద్దేశ్యపూర్వకంగానే లీకులు ఇప్పించారంటున్నారు.
ఈ లోగానే ఓటింగ్ ప్రక్రియ ముగిసేలా కిరణ్ వ్యూహ రచన చేశారని అంటున్నారు. నిమిషంన్నరలోనే కిరణ్ నోటీసు పైన ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఓటింగులో డివిజన్ రాకుండా కిరణ్ జాగ్రత్త పడ్డారు. స్పీకర్ సభ లోపలకు వచ్చీ రాగానే కిరణ్ ఇచ్చిన తీర్మానం చదవడం ప్రారంభించారు.

అదే సమయంలో తెలంగాణ ప్రాంత నేతలు పేపర్లు చించి వేశారు. మరోవైపు ఓటింగ్ ముగిసిందంటూ స్పీకర్ ప్రకటన చేశారు. తెలంగాణ బిల్లును సభ తిరస్కరించిందని చెప్పారు. సభాపతి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన తీర్మానాన్ని చదువుతుండగా సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు ఆయనకు దడిగా నిలబడ్డారు. మూజువాణి ఓటు అంటే ఏకగ్రీవమేనని సీమాంధ్ర నేతలు చెబుతున్నారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లు పైన ఓటింగ్ జరగలేదని, ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసు పైన మాత్రమే జరిగిందని చెప్పారు. బిల్లు పైన ఎలాంటి ఓటింగ్ జరగలేదన్నారు. తెలంగాణ ప్రాంత నేతలు కూడా అదే చెబుతున్నారు. కిరణ్ తీర్మానం పైన జరిగిన మూజువాణి ఓటు తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేది కాదంటున్నారు. కాగా, రెండో ఎస్సార్సీతోనే తెలంగాణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications