అంబానీ, అదానీల పార్టీ: బిజెపిపై జైపాల్, కెసిఆర్‌పై ధ్వజమెత్తిన జానా
హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా వడ్యాల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతులు గిట్టుబాటు ధరలేక అల్లాడిపోతున్నారని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల భూములు లాక్కొని కోటీశ్వరులకిస్తోందని జైపాల్ రెడ్డి ఆరోపించారు. గతంలో చిన్న వ్యాపారుల పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ.. ఇప్పుడు కోటీశ్వరుల పార్టీ అయిందని అన్నారు. అంబానీ, అదానీ, టాటా, బిర్లా పార్టీ అయిందని అన్నారు. రాహుల్ గాంధీ రైతు బాణం మోడీ ప్రభుత్వానికి రామ బాణం అవుతుందని అన్నారు. పారిశ్రామిక వేత్తల కోసం మోడీ ప్రభుత్వం భూసేకరణ చేపట్టిందని ఆరోపించారు.
కాంగ్రెస్ వల్లే తెలంగాణ: జానారెడ్డి

కాంగ్రెస్ వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేకుంటే ఎన్నేళ్లయినా తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. కాంగ్రెస్ చరిత్రే త్యాగలమయమని చెప్పారు. రైతులకు భరోసా ఇచ్చేందుకే రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వానికి రాహుల్ యాత్ర ఓ హెచ్చరిక అని అన్నారు. అధికారం లేనప్పుడు మాత్రమే ప్రజల వద్దకు రాలేదని చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీలను కెసిఆర్ ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ పరిశ్రమలు తెరిపిస్తామని చెప్పిన కెసిఆర్.. ఇప్పుడేమి చేయడం లేదని అన్నారు. కెసిఆర్ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని అన్నారు.
మెట్‌పల్లి చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని అన్నారు. సోనియా, రాహుల్ గాంధీ అండగా ఉంటారని చెప్పారు. అధికారం లేనంత మాత్రాన కాంగ్రెస్ పనైపోదని అన్నారు. పదవులు, ప్రభుత్వం లేకున్నా కాంగ్రెస్ చిరకాలం ఉంటుందని చెప్పారు. రాహుల్ గాంధీ రైతుల కోసం పోరాటం చేస్తారని, ఆయన వెంట మనమంతా ఉందామని ఎంపి విహెచ్ అన్నారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడి రైతులకు అండగా ఉంటుందని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ విధానాతో రైతుల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైందని అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోకూడదనే రాహుల్ గాంధీ యాత్ర చేశారని చెప్పారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సిఎం కెసిఆర్ నిద్రపోతున్నారా? అని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రైతుల కోసమే రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి ఆదిలాబాద్ వచ్చి 15 కి.మీల యాత్ర చేశారని చెప్పారు. మోడీ, కెసిఆర్ ప్రభుత్వాలకు కళ్లు తెరిపించేందుకు యాత్ర చేశారని తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 900మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications