పవన్ కల్యాణ్‌పై జనసేనలో వ్యతిరేకత..ఇలా అయితే కష్టం బాసూ..!
అసెంబ్లీ సాక్షిగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..మరో 15 ఏళ్ల పాటు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.మాలో మాకు వంద ఉంటాయ్..అయినప్పటికీ సర్దుకుని ముందుకు వెళ్తామని ఆయన చెప్పుకొచ్చారు.మరో 15 ఏళ్ల పాటు వైసీపీని అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమని పవన్ చెప్పారు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
మొన్నటికి మొన్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రానికి మరో 10 ఏళ్లు సీఎంగా ఉండాలని తాను భావిస్తున్నానని తెలిపారు. దీనిపై జనసేన కార్యకర్తలు, నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే జనసేన కార్యకర్తలు మరో 10 ఏళ్లు టీడీపీ జెండాలు మోయాల్సిందేనా అని తమ నాయకుడిని ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన మరో ఐదేళ్లను పొడిగించారు. 10 నుంచి 15 ఏళ్లు అధికారం కోసం పోరాటం చేయడం తప్ప, అధికారాన్ని చేపట్టేది లేదని పవన్ తన వ్యాఖ్యలతో స్పష్టం చేశారు.వాస్తవానికి ప్రస్తుతం కొనసాగుతున్న కూటమి ప్రభుత్వంలోనే జనసేన కార్యకర్తలు సీఎం సీటు షేరింగ్ ఆశించారు. రెండున్నర సంవత్సరాలు చంద్రబాబు, మరో రెండున్నర సంవత్సరాలు పవన్ కల్యాణ్ సీఎంగా చేయాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు.

అయితే పవన్ కల్యాణ్ చంద్రబాబే పూర్తి స్థాయిలో సీఎంగా ఉంటారని తెలపడంతో ఆ పార్టీ కార్యకర్తలు నిరాశకు గురయ్యారు.పవన్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో జనసేన నాయకులు, కార్యకర్తలు మరోసారి అయోమయంలో పడ్డారు.15 ఏళ్లు వైసీపీకి అవకాశం ఇవ్వమని చెప్పిన పవన్ కల్యాణ్, అధికారంలో ఉంటే సీఎం ఎవరనేది మాత్రం చెప్పడం లేదు. ఇదే ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తలకు పెద్ద సమస్యగా మారింది.కూటమి అధికారంలో ఉంటే చంద్రబాబే సీఎంగా ఉంటారు. ఇదే విషయాన్ని పవన్ సైతం చెప్పడం జరిగింది. దీని వల్ల జనసేనకు వచ్చే లాభం ఏంటని ఆ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
వైసీపీని నిర్వీర్యం చేయాలని చూస్తూ.. పవన్ టీడీపీకి దాసోహం అవుతున్నారనే చర్చ ఆ పార్టీలో సాగుతోంది. మరోవైపు 11 సీట్లు వచ్చినప్పటికీ, 40 శాతం ఓటింగ్ శాతంతో వైసీపీ ప్రజల్లో బలంగా ఉంది. అలాంటి పార్టీని పూచిక పుల్ల మాదిరిగా తీసివేయడం అంటే మన వేలుతో మన కంటిని పొడుచుకున్నట్టే. సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని జనసేన కార్యకర్తలు సైతం వ్యక్తం చేస్తున్నారు. 40 శాతం ఓటు బ్యాంకు వైసీపీని 10 శాతం కూడా సరిగా లేని జనసేన పార్టీ ఓడించడం అంటే మామూలు విషయం కాదనే చర్చ జనసేనలో జరుగుతోంది.రాష్ట్రంలో అత్యధిక ఓటింగ్ శాతం వైసీపీ దక్కించుకుంది. మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల అధికారం కూటమికి సాధ్యం అయింది.
పైగా బూత్ స్థాయిలో వైసీపీ చాలా బలంగా ఉంది. ఇదే జనసేన విషయానికి వస్తే గ్రామస్థాయిలో ఆ పార్టీకి పెద్దగా బలం లేదు. పోల్ మ్యానేజ్‌మెంట్‌పై కూడా ఆ పార్టీకి పెద్దగా అనుభవం లేదు. టీడీపీ మద్దతుతో గత ఎన్నికల్లో విజయం సాధించింది. అన్ని ఎన్నికల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు.పైగా గెలిచిన 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ ఎఫెక్ట్ చంద్రబాబు కన్నా పవన్ కల్యాణ్ మీదనే ఎక్కువగా పడుతుందని వారి భావన.ఇప్పటికే కొందరు జనసేన కార్యకర్తలు బహిరంగంగానే పవన్ కల్యాణ్ తీరును తప్పుబడుతున్నారు. మరికొందరు నేరుగా పవన్‌ను ప్రశ్నిస్తున్నారు.జనసేనకు మద్దతు తెలిపి తప్పు చేశామని మరికొందరు వాపోతున్నారు.
ఇదిలా ఉంటే క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేనల మధ్య సఖ్యత కూడా అంతంత మాత్రంగానే ఉంది. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులదే పెత్తనం కొనసాగుతోంది.ఇటీవల పిఠాపురం టీడీపీ నేత వర్మ చేసిన ట్వీటే ఇందుకు నిదర్శనం. కష్టపడింది ఒకరు..పదవి అనుభవిస్తోంది మరొకరని అర్థం వచ్చేలా వర్మ ట్వీట్ చేశారు. చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలానే ఉంది. ఇవ్వన్ని పట్టించుకోని పవన్ ఇలా ఏకపక్షంగా టీడీపీకి మద్దతు తెలపడం ఆ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు పెద్దగా రుచించడం లేదు.పవన్ తన తీరు మార్చుకోవాలని లేదంటే వైసీపీ సంగతి అటుంచితే, జనసేన మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications