టీలో మాదే గెలుపు: జయసుధ, కెసిఆర్ తప్పారు: జానా
హైదరాబాద్: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసు పార్టీయే విజయం సాధిస్తుందని ఆ పార్టీ సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆమె తిరిగి సికింద్రాబాద్ శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రెండోసారి టికెట్ ఇచ్చినందుకు ఆమె కాంగ్రెసు నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహిస్తానని జయసుధ అన్నారు.
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని ఇచ్చిన హామీని తమ పార్టీ నిలబెట్టుకుందని సీనియర్ కాంగ్రెసు నేత కె. జానారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలో ఆయన మంగళవారం ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందని ఆయన అన్నారు.

తెలంగాణ ఇస్తే తెరాసను కాంగ్రెసులో విలీనం చేస్తామని ఇచ్చిన మాటను ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తప్పారని ఆయన విమర్శించారు. కెసిఆర్ మాట మీద నిలబడే మనిషి కాదని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే బిజెపికి ఓటేసినట్లేనని తెలంగాణ ముస్లింలకు చెబుతామని తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బిజెపి, టిడిపి పొత్తు చారిత్రక తప్పిదమని ఆయన అన్నారు. గుజరాత్ ముస్లింల ఊచకోతలో నరేంద్ర మోడీ పాత్ర ఉందని, అలాంటి వ్యక్తి దేశానికి ప్రధాని అయితే ప్రమాదమని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications