శ్రీవారి దర్శనం కోసం వచ్చి తిరుమలలో చండీగఢ్ హైకోర్టు జడ్జీ కన్నుమూత
తిరుపతి: ఛండీగఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరేశ్‌కుమార్ సంఘీ సోమవారం కన్నుమూశారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆయన గుండెపోటుతో మరణించినట్లు తిరుపతి స్విమ్స్ వైద్యులు తెలిపారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఆదివారం తిరుమల చేరుకున్నారు. సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం భోజనానంతరం శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లాలనే ప్రయత్నంలో ఉండగా ఛాతి నొప్పిగా ఉందంటూ కుటుంబసభ్యులకు తెలిపారు.

వెంటనే తిరుమలలోని అపోలో అత్యవసర హృదయ చికిత్సాలయానికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్‌కు తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆయన మరణించినట్లు నిర్ధారించారు.
ఈ విషయం తెలుసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు వైద్యులతో మాట్లాడారు. స్విమ్స్ ఆస్పత్రికి చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు న్యాయమూర్తులు చేరుకుని నివాళులర్పించారు.
కాగా, హైకోర్టు న్యాయమూర్తి నరేష్ కుమార్ సంఘీకి మృతికి సంతాప సూచకంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని అన్ని కోర్టులకు మంగళవారం సెలవు ప్రకటించారు.












Click it and Unblock the Notifications