మోడీ కాకుంటే ఇంకొకరు, అందర్నీ వెళ్లమనం: కెసిఆర్
హైదరాబాద్: దేశాన్ని చూసేందుకు నరేంద్ర మోడీ కాకుంటే ఇంకొకరు వస్తారని, తెలంగాణ గోస చూసేది మాత్రం మనమేనని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం అన్నారు. పలువురు నల్గొండ జిల్లా చెందిన నేతలు తెరాసలో చేరిన సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. తాము ఆంధ్రోళ్లందర్నీ సీమాంధ్రకు వెళ్లమనడం లేదన్నారు. అక్రమంగా ఉన్న ఉద్యోగులను ఇక్కడి నుండి వెళ్లమంటున్నామని చెప్పారు.
సీమాంధ్ర ఉద్యోగులు అక్రమంగా ఉంటే ఇక తెలంగాణ వచ్చి ఏం లాభమని ప్రశ్నించారు. అక్రమంగా నియామకమైన ఉద్యోగులు వెళ్లాలన్నారు. మన రాష్ట్రం... మన పార్టీ ఇదే తమ నినాదమన్నారు. కొత్త రాష్ట్రంలో కొత్త పంథాను అనుసరిద్దామని పిలుపునిచ్చారు. వలసల పాలకులు తెలంగాణ ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. నాయకులు పొరపాటు చేస్తే తెలంగాణ రాష్ట్రం సాధించి ఏం లాభమన్నారు.

పాత పద్ధతులు మారాలని కోరారు. బడుగు, బలహీనవర్గాల ముఖాల్లో చిరునవ్వులు చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి తాము కృషి చేస్తామని చెప్పారు. భూమిలేని దళితులకు భూమిని ఇస్తామన్నారు. దేశంలోనే అత్యున్నతమైన గృహాల నిర్మాణాలను చేపడతామన్నారు. బలహీన వర్గాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఉచిత నిర్బంధ చదువు అమలులోకి తెస్తామన్నారు.
తెరాస అధికారం కోరుకోవడం లేదని, వసూళ్ల కోసం కాదని.. తెలంగాణ గోస తీర్చేందుకే అన్నారు. లోకసభకు బిజెపికి ఓటేయాలన్న ఆలోచన తెలంగాణ ప్రజలు మానుకోవాలన్నారు. దేశాన్ని చూసేందుకు మోడీ కాకుంటే మరొకరు వస్తారని చెప్పారు. తెలంగాణను మాత్రం మనమే చూసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications