విలీనం, పొత్తులపై ఇప్పుడే కాదు: కెటిఆర్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఇచ్చిన మాట ప్రకారమే తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు రేపు (బుధవారం) తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెడుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు అన్నారు. రేపు హైదరాబాదులోని బేగంపేట నుంచి భారీ ర్యాలీ ఉంటుందని ఆయన మంగళవారం మీడియాతో చెప్పారు. కాంగ్రెసులో తమ పార్టీ విలీనమవుతుందని ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు.
అందరితో చర్చించిన తర్వాతనే కాంగ్రెసుతో పొత్తు పెట్టుకోవాలా, కాంగ్రెసులో విలీనం చేయాలా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అపాయింటెడ్ డే, ఎన్నికల షెడ్యూల్ తర్వాతనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.

ఇప్పటి వరకు టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, ఇక ముందు టిఆర్ఎస్ అంటే తిరుగులేని శక్తి అని ఆయన అన్నారు. తమ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కెఎస్ రత్నం, మహేంద్ర రెడ్డిలకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు తాము అంగీకరించబోమని, తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నికలు జరగాలని ఆయన అన్నారు. వెంటనే అపాయింట్ డే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
వ్యక్తిగత కారణాల వల్లనే తాను గతంలో తెరాస నుంచి బయటకు వచ్చినట్లు కెఎస్ రత్నం చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములం కావాలనే కోరికతో తిరిగి తెరాసలోకి వచ్చినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications