‘అవిశ్వాసం’ చీప్ పాలిటిక్స్, టీడీపీతో పొత్తు?: ఏపీ హోదాపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శనివారం మీడియాతో మాట్లాడుతూ కీలక అంశాలపై స్పందించారు. దేశంలో థర్డ్ ఫ్రంట్ తోపాటు టీడీపీతో పొత్తు, వైసీపీ అవిశ్వాస తీర్మానం, ఏపీ, తెలంగాణలకు జరిగిన అన్యాయంపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

టీడీపీతో పొత్తుపై కేసీఆర్
తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంపై తాను స్పందించనని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పారు. ఇటీవల టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ పార్టీతో పొత్తుపై ఆలోచిస్తున్నామని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కేసీఆర్ పై విధంగా స్పందించారు.

ఏపీ ప్రజలతో తమాషానా?
ఏపీ ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీపై స్పష్టతనివ్వడం లేదని అన్నారు. ఇదేమైనా తమాషానా? అని కేసీఆర్ ప్రశ్నించారు. దీని కోసమే భారత రాజకీయాలు మారాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

మోడీనే తేల్చి చెప్పాలి..
ప్రధాని మోడీ.. హోదా ఇస్తామని చెబితే ఇవ్వాలి లేదంటే తాను చెప్పలేదని కుండబద్దలు కొట్టాలి అని కేసీఆర్ అన్నారు. ప్రజలను వంచనకు గురిచేయడం సరికాదని అన్నారు.

అవిశ్వాసం చీప్ పొలిటిక్స్
ఏపీకి ప్రత్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తున్న ఏపీ రాజకీయ పార్టీల నిర్ణయంపైనా కేసీఆర్ స్పందించారు. అవిశ్వాసం పెట్టాలన్న ప్రయత్నమే చిల్లర రాజకీయాలని కొట్టిపారేశారు. అవిశ్వాసం పెట్టడం వల్ల కేంద్రం బెదిరిపోదని కేసీఆర్ చెప్పారు. కాగా, వైసీపీ పార్లమెంటులో 21న అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications