కిరణ్ తలూపారు, ప్రతి అడుగు విభజన వైపే: జగన్ పార్టీ
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీలో, సిడబ్ల్యూసిలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తలూపి విభజనకు పూర్తిగా సహకరించారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు మండిపడ్డారు. విభజనను ఆపుతానంటూ ప్రగల్భాలు పలికిన కిరణ్ వేస్తున్న ప్రతి అడుగు, చేస్తున్న ప్రతి పని విభజనకు అనుకూలంగానే ఉందన్నారు.
సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగుల ఆందోళన పైన నీళ్లు జల్లారన్నారు. శాసన సభ తీర్మానం లేకుండా విభజన బిల్లు నేరుగా రాష్ట్రానికి పంపింది ఒక్క రాష్ట్రానికి మాత్రమేనని తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. స్పీకర్ తన విశిష్ట అధికారాలను ఉపయోగించి మొదట బిల్లుపై అనుకూల, వ్యతిరేక అభిప్రాయం తెలుసుకునేందుకు ఓటింగ్ జరిపి తర్వాత చర్చ చేపట్టాలన్నారు.

సోనియా ఆదేశాల మేరకే జగన్: గాలి
వైయస్ జగన్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకే పని చేస్తున్నారని టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. రాష్ట్రాన్ని ఎలాగైనా విభజించలనే ఉద్దేశ్యంతో జగన్ ముందుకు సాగుతున్నారన్నారు. ఓట్లు, సీట్లు, పదవుల కోసమే అందరు కలిసి నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. సిబిఐ పూర్వ జెడి లక్ష్మీ నారాయణకు ఇంత వరకు పోస్టింగ్ ఇవ్వలేదన్నారు. దీనిని బట్టి కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల ఒప్పందాలు అర్థమవుతున్నాయన్నారు.
లీకుల మహారాజు మౌన ముని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని దేవినేని ఉమామహేశ్వర రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ బిల్లుపై స్పీకర్ ఓటింగ్ పెట్టి అభిప్రాయాలు తెలుసుకోవాలని అప్పుడే జగన్, సిఎంల డ్రామాలు బయటపడుతాయన్నారు. జగన్ 18 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయించుకొని ఓదార్పు యాత్ర నిర్వహించుకోవాలని దేవినేని ఉమా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications