మార్చి 2న కిరణ్ పార్టీ: 4పేర్లు పరిశీలన, టిలోను పోటీ?
హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డి తన కొత్త పార్టీని మార్చి 2న రాజమండ్రిలో ప్రకటించే అవకాశముంది. ఆ తర్వాత తిరుపతిలోను భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. పార్టీకి నాలుగు పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. సమైక్యగళం వినిపించిన కిరణ్ సీమాంధ్రలోనే కాకుండా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా పోటీ చేసే యోచనలో ఉన్నారట. ఖమ్మం, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టే అవకాశముందట.
కిరణ్ కొత్త పార్టీ ఏర్పాటుకు రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. కొత్త పార్టీ ఏర్పాటుపై మీ అభిప్రాయం చెప్పండంటూ ఆయన వివిధ వర్గాలను కోరుతున్నారు. పార్టీ విధి విధానాలు ఎలా ఉండాలని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం ఎంపీలతో సమావేశమైన కిరణ్ సోమవారం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. బుధవారం సీమాంధ్ర జిల్లాల విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశం కానున్నారు.

అదే సమయంలో పార్టీ విధి విధానాలు ఎలా ఉండాలన్న అంశంపై ఆయన ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. తమ పార్టీ ప్రజల కోసమనే నినాదంతో ముందుకు వెళ్లనున్నారట. ముఖ్యంగా యువత, ఉద్యోగులు, మహిళలే లక్ష్యంగా కొత్త పార్టీని స్థాపించాలన్న యోచనలో కిరణ్ ఉన్నారు. విభజనను అడ్డుకునేందుకు తాను ప్రయత్నాలు చేస్తుంటే కొందరు మంత్రులు తన పక్కనే ఉంటూ సమైక్య వాదాన్ని గట్టిగా వినిపిస్తూ టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలతో లోపాయికారీ ఒప్పందాలను జరుపుకొన్నారని కిరణ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి నేతలను చూసే, తమకేమీ అడ్డుండదన్న భావనతో కేంద్రం గుడ్డిగా ముందుకెళ్లిందని ఆయన భావిస్తున్నారు. తన పార్టీలో ఇలాంటి అవకాశవాదులకు స్థానం ఇవ్వరాదనే ఉద్దేశంతో ఆయన ఉన్నారట. మాదాపూర్‌లోని సోమవారం మంత్రులు శైలజానాథ్, పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు జెసి దివాకర రెడ్డి, గాదె వెంకట రెడ్డి, కొర్ల భారతి, రౌతు సూర్యప్రకాశ రావు, వంగా గీత, పంతం గాంధీ, అంజిబాబు, ఎమ్మెల్సీలు పాలడుగు వెంకట్రావు, రెడ్డప్ప రెడ్డిలతో సమావేశమయ్యారు. ఒక్కొక్కరి నుంచి వ్యక్తిగతంగా అభిప్రాయాలు సేకరించారు.
గవర్నర్‌కు కిరణ్ లేఖ
తాను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగలేనని కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాశారు. దీనిని గవర్నర్‌కు ఫ్యాక్స్‌లో పంపించారు. సోమవారం రాత్రి కిరణ్ ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, సాయి ప్రతాప్, హర్ష కుమార్, సబ్బం హరిలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాను రాజీనామా చేసినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కేంద్రం రాజకీయంగా కుట్ర పన్నుతోందన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌కు లేఖ రాయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications