టీటీడీలో ఆధిపత్య పోరు, ఎవరికి వారే - తొక్కిసలాట వెనుక..!!
టీటీడీలో కోల్డ్ వార్ కొనసాగుతోంది. ముగ్గురు కీలక వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. తాజాగా తిరుపతిలో తొక్కిసలాట వెనుక అనేక కారణాలు విచారణలో బయటకు వస్తు న్నాయి. వైకుంఠ ఏకాదశికి భక్తుల రద్దీ పైన అంచనాలు ఉన్నా.. ఏర్పాట్లలో సమన్వయ లోపం స్పష్టం అయింది. చంద్రబాబు సమక్షంలోనే ఛైర్మన్ - ఈవో వాగ్వాదానికి దిగారు. టీటీడీ ప్రక్షాళన అవసరమని పవన్ చెప్పుకొచ్చారు. అయితే, అసలు జిల్లా రెవిన్యూ - పోలీసు అధికారులతో టీటీడీ సమన్వయ లేమి ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
టీటీడీలో ఏం జరుగుతోంది
కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని కాపాడాల్సిన టీటీడీలో కీలక బాధ్యతల్లో ఉన్న వారి మధ్య పోరు సాగుతోంది. తమ మాటే చెల్లుబాటు కావాలనే ధోరణితో ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. టీటీడీ ఛైర్మన్, ఈవో, ఏఈవో మధ్య సమన్వయం లేదనే విషయం తాజా తొక్కిసలాట ఘటనతో బయట పడింది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఛైర్మన్, ఈవో కలిసి ఒక్క భేటీలోనే పాల్గొన్నారు. తొక్కిసలాట ఘటన విషయంలోనూ విచారణ సంస్థలు కీలక అంశాలను ప్రభుత్వానికి నివేదించాయి. పూర్తిగా సమన్వయం, ప్రణాళికా లోపం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని నిర్ధారించినట్లు తెలుస్తోంది.

ప్రణాళికలు లేకుండా
ఈ నివేదికల్లో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. టీటీడీ పది రోజుల పాటు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగంతో ముందస్తు సమావేశం నిర్వహించకపోవటం విమర్శలకు కారణమైంది. తిరుపతిలో ఎనిమిది ప్రాంతాల్లో టోకెన్ల జారీ కేంద్రాలు ఏర్పాటు చేసి 90 కౌంటర్ల ద్వారా భక్తులకు టోకెన్లు జారీ చేసే క్రమంలో అనేక ఏర్పాట్లు ..ప్రణాళికలు ముందస్తుగానే సిద్దం చేసుకోవాలి. ఈ మేరకు వరుస సమీక్షల ద్వారా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఏర్పాట్ల పైన ఈవో కాకుండా తిరుమల అదనపు ఈవో పేరిట ఏర్పాట్ల కోసం కలెక్టర్‌కు లేఖ మాత్రమే అందింది.
సమన్వయ లోపం
ఇక, పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న సమయంలో ప్రమాదాల నివారణ కోసం ఏర్పాట్ల పైన సమీక్ష లో అధికారులు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, టీటీడీ ఏఈవో నుంచి లేఖ రావటం.. అదే విధంగా కలెక్టర్ యథాప్రకారం పోలీసు బందోబస్తు కోసం ఎస్పీకి.. వైద్య సిబ్బందిని, అంబులె న్సులను ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారికి.. అగ్నిమాపక ఏర్పాట్ల కోసం ఆ శాఖ జిల్లా అధికారికి ఆదేశాలు జారీ చేశారు. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద పర్యవేక్షణకు తహశీల్దార్ల ను నియమించారు. వీటిపై ప్రత్యేక దృష్టి సారించలేదు. భక్తుల రద్దీకి అనుగుణంగా సమాచారం ఇస్తూ చర్యలు తీసుకోవాల్సిన టీటీడీ, రెవిన్యూ, పోలీసు శాఖల మధ్య సమన్వయం కనిపించ లేదు. అనాలోచిత నిర్ణయాలు, గేటు తెరవటం..దాంతో ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరిగింది.












Click it and Unblock the Notifications