కిరణ్ సిక్సర్ కొట్టాడు, బ్యాటింగ్ ఇంకా ఉంది: లగడపాటి
న్యూఢిల్లీ: విభజన బిల్లును శానససభలో ఓడించడం ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిక్సర్ కొట్టారని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. బిల్లును ఓిడిస్తానని ముఖ్యమంత్రి చెప్తే ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారని, కానీ బిల్లును ఓడించారని ఆయన అన్నారు. బ్యాటింగ్ ఇంకా మిగిలి ఉందని, విజయం సాధించి బ్యాట్‌ను విజయహాసంతో ఊపుతూ మైదానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వెనక్కి వస్తారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిగా అభివృద్ధి చెందిన తర్వాత ఆదాయం మాది, ఉద్యోగాలు మావి అని అంటున్నారని లగడపాటి విమర్శించారు. అన్యాయం, దోపిడీ చేశారని అంటున్నారని, కానీ తెలంగాణ పటేల్ పట్వారీలే తెలంగాణ ప్రజలను దోపిడీ చేశారని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తమ పార్టీ అధిష్టానం విభజనకు తెగించిందని ఆయన అన్నారు.

స్పీకర్ నాదెండ్ల మనోహర్‌పై కూడా అభాండాలు వేస్తున్నారని, అది సరి కాదని ఆయన అన్నారు. అత్యధిక ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించి విభజన బిల్లును ఓడించారని ఆయన అన్నారు. విభజన బిల్లును అసెంబ్లీ తిరస్కరించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విభజనపై ఆలోచన చేయాలని ఆయన అన్నారు. అసెంబ్లీతో పని లేనప్పుడు బిల్లును ఎందుకు పంపించారు, ఎందుకు అభిప్రాయం కోరారని ఆయన అడిగారు.
దేశంలో నియంతల పాలన లేదని, ప్రజాస్వామ్యంలో ఉన్నామని, నిబంధనలూ పద్ధతలూ సంప్రదాయాలూ ఉంటాయని ఆయన అన్నారు. సభను నడిపించలేకపో నిరవధికంగా పార్లమెంటును వాయిదా వేయించుకున్న మైనారిటీ ప్రభుత్వాన్ని నమ్ముకుని నేతలు ప్రజలను మభ్యపెట్టడం సరి కాదని ఆయన అన్నారు.
అసెంబ్లీ ఆమోదం, అంగీకారం లేకుండా విభజన బిల్లును పార్లమెంటుకు తీసుకు రావడం అన్యాయమని ఆయన అన్నారు. విభజనను అడ్డుకోవడానికి తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. తాము తెలుగు జాతి పతనానికి సిద్ధంగా లేమని, రాష్ట్ర సమైక్యతను కాపుడాతమని ఆయన అన్నారు. పార్లమెంటులో మునుపటి కన్నా ఎక్కువ మద్దతు కూడగడుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications