కెసిఆర్ దళిత ప్లాన్: ఆగస్టు 15 నుంచి భూపంపిణీ
హైదరాబాద్: దళితులకు మూడెకరాల చొప్పున భూమిని పంపిణీ చేసే కార్యక్రమానికి ఆగస్టు 15వ తేదీన శ్రీకారం చుట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 15వ తేదీన కరీంనగర్ జిల్లాలో కెసిఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. "సాంఘిక సంక్షేమ శాఖ పేరు మార్చేయండి. ఇకపై దానిని ఎస్సీ అభివృద్ధి శాఖగా పిలవాలి. అభివృద్ధిని ఇప్పటి వరకు కాగితాల్లో చూపించారు. ఇకముందు దళిత వాడల్లో ఆ అభివృద్ధి కనిపించాలి'' అని కెసిఆర్ జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
దళితుల అభివృద్ధిపై మంగళవారం సచివాలయంలో ఆయన జిల్లా కలెక్టర్లతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 7:45 గంటల వరకు జరిగిన సమావేశంలో మంత్రి ఈటెల రాజేందర్, సీఎస్ రాజీవ్ శర్మ, సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ రాధ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్‌తోపాటు 10 జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఘంటా చక్రపాణి, మల్లేపల్లి లక్ష్మయ్య పాల్గొన్నారు.

"భూమి లేని వ్యవసాయాధారిత దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని ఇవ్వాలి. ఆ కుటుంబానికి ఎకరం భూమి ఉంటే అదనంగా రెండెకరాలు, రెండెకరాలుంటే మరో ఎకరం ఇవ్వాలి. గరిష్ఠంగా ప్రతి దళిత కుటుంబం మూడెకరాల భూమి కలిగి ఉండేలా చర్యలు తీసుకోండి'' అని ఆదేశించారు. పంపిణీ చేసే భూమి దళిత మహిళ పేరిట ఉండాలని, భూ యాజమాన్య హక్కులు ఆమెకే దక్కేలా రిజిస్ట్రేషన్లు చేయాలని సూచించారు. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని, ఆగస్టు 15వ తేదీన భూ పంపిణీకి ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు.
భూ పంపిణీకి దళిత కుటుంబాల గుర్తింపు ప్రక్రియ వేగవంతంగా జరగాలని, తెలంగాణవ్యాప్తంగా 433 మండలాల్లోని 433 గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఎస్సీల అభివృద్ధికి ఏటా జిల్లాకు రూ.600 కోట్ల నిధులు ఇస్తామని, మొత్తంమీద ఐదేళ్లలో ఒక్కో జిల్లాలో రూ.4000 కోట్ల వరకూ ఖర్చు చేస్తామని సీఎం కెసిఆర్ ప్రకటించారు.
బడ్జెట్‌లో 15.4 శాతం నిధులను దళితుల కోసం కేటాయిస్తామని, ఇవికాక కేంద్రం నుంచి వచ్చే నిధులను కలిపితే ఐదేళ్లలో జిల్లాకు రూ.4000 కోట్ల నిధుల అందుతాయని చెప్పారు. ఇన్ని నిధులను చరిత్రలో ఇప్పటిదాకా ఖర్చు చేయలేదని, ఈ మేరకు కలెక్టర్లే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. తెలంగాణను 510 యూనిట్లుగా విభజించి, పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా ప్రజా ప్రతినిధుల సహకారంతో కార్యక్రమాలను అమలు చేయాలని, విద్యావంతులైన దళిత యువతీ యువకులతో బస్తీ కమిటీలు వేసుకోవాలని కెసిఆర్ సూచించారు.
గ్రామంలో దళిత రైతుకు వేర్వేరు చోట్ల ఎకరం, రెండెకరాల భూమి ఉంటే ఆ భూమినంతా ఒకచోటికి చేర్చడానికి కమతాల ఏకీకరణ (నిజాం కాలంలో రద్దు బదులు పథకం) చేపట్టాలని, దీనిపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు రిజిస్ట్రేషన్ చార్జీలను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. దళితులకు వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చడానికి బ్యాంకు లింకేజీ, బ్యాంకుతో సంబంధం లేకుండా రుణాలు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications