మందుబాబులకు షాక్... ఏపీలో మద్యం షాపుల బంద్?
ఏపీలో గత ఐదు సంవత్సరాలుగా అభాసుపాలైన మద్యం విధానంలో మార్పులు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల్లో ఉన్న మద్యం విధానాన్ని ఎక్సైజ్ అధికారులు అధ్యయనం చేసి ఒక నివేదికను రూపొందించారు. తెలంగాణ తరహా మద్యం విధానమైతే మంచిదని భావించి దాన్నే అమలు చేయబోతున్నారు. అక్టోబరు నుంచి మద్యం రిటైల్ షాపులను ప్రయివేటు వ్యక్తులద్వారా నిర్వహింపచేస్తారు. దీనికోసం టెండరు ప్రక్రియ నడుస్తుంది. త్వరలోనే విధివిధానాలను ఖరారు చేయబోతున్నారు.
తమకు అన్యాయం చేయవద్దు
ప్రస్తుతం ఉన్న మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ఇందులో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఎంపికైన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రయివేటు వ్యక్తులకు మద్యం షాపులు కేటాయిస్తే వీరికి ఉద్యోగాలు ఉండవని ప్రచారం నడుస్తోంది. అక్టోబరు నెల నుంచి కొత్త మద్యం షాపులు వస్తున్నాయని, పూర్తిగా ప్రయివేటు పరం చేస్తామని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఐదు సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్న తమకు అన్యాయం చేయవద్దని ఉద్యోగులు వేడుకుంటున్నారు.

జిల్లా ఎంపిక కమిటీ నియమించింది
గత ప్రభుత్వం పత్రికలద్వారా ప్రకటనలిచ్చి జిల్లా సెలక్షన్ కమిటీద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి తమను నియమించాయని, ఇప్పటికీ కనీస వేతనం ఇవ్వడంలేదని, పీఎఫ్, ఈఎస్ఐతోపాటు ఓటీలను కూడా ఏజెన్సీలు తినేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు తాము కూడా మద్దతు తెలిపామని, ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న 18వేల మందిని రోడ్డున పడవేయవద్దని కోరుతున్నారు.
ప్రభుత్వం తమకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని, లేదంటే ఎపి బెవరేజేస్ కార్పొరేషన్ కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చేనెల నాలుగో తేదీ నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అవసరమైతే ఏడోతేదీన ప్రభుత్వ మద్యం దుకాణాల బంద్ కు పిలుపునిస్తామని యూనియన్ నాయకులు తెలిపారు.












Click it and Unblock the Notifications