రూ.260 కోట్లతో అమరావతిలో శ్రీవారి ఆలయం.. నేడే భూమి పూజ !!
ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రతిష్టాత్మక ఆధ్యాత్మిక ప్రాజెక్ట్‌కు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారు అమరావతి లోని కృష్ణా నది తీరంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రెండు దశల్లో విస్తరించేందుకు, అభివృద్ధి చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మొత్తం రూ. 260 కోట్ల భారీ వ్యయాన్ని ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూమిపూజ..
కాగా ఇవాళ ( నవంబర్ 27, 2025 ) ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆలయ విస్తరణ కార్యక్రమానికి సంబంధించిన భూమిపూజలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. దాదాపు 3,000 మంది భక్తులు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీఐపీ, భక్తుల రాకపోకలకు ప్రత్యేక మార్గాలు, భద్రతా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

కాగా రెండు దశల్లో ఈ పనులు మొత్తం జరగనుండగా.. ప్రభుత్వం తొలి దశలో సుమారు రూ. 140 కోట్లతో కీలక నిర్మాణాలు చేపడుతోంది. రూ. 92 కోట్లతో పటిష్ఠమైన ప్రాకారం (Compound Wall) నిర్మాణం, ఆలయ పరిసర ప్రాంతాల పునర్నిర్మాణం.. ల్యాండ్ స్కేపింగ్, భక్తులకు చేరువగా ఉండే విధంగా మార్గాలు, రోడ్లు, పార్కింగ్ స్థలాల ప్రాథమిక నిర్మాణం చేపట్టనుంది. ఆలయం భద్రత, నిర్మాణ బలం, భక్తులకు సౌకర్యాలు అందించే పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఇక రెండో దశ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం మరో రూ. 120 కోట్ల వ్యయం ప్రతిపాదించింది. ఈ దశలో తిరుమలలానే మాడవీధుల నిర్మాణం, ఏడంతస్తుల రాజగోపురం నిర్మాణం, పుష్కరిణీ పునర్నిర్మాణం.. భారీ సేవా మండపం, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం, రత మండపం వంటి శిల్పకళాత్మక శైవ-వైష్ణవ నిర్మాణాలు జరగనున్నాయి. మొత్తంగా తిరుపతి శ్రీవారి ఆలయ సాంప్రదాయ శైలిని ప్రతిబింబించేలా డిజైన్ చేయనున్నారు.
కూటమి ప్రభుత్వం ముఖ్యంగా భక్తులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటిలో..
- భారీ అన్నదాన కాంప్లెక్స్‌లు
- విశ్రాంతి భవనాలు
- భక్తుల వాహనాల కోసం మల్టీ-లెవెల్ పార్కింగ్
- ప్రత్యేక క్యూలైన్లు, వేయిటింగ్ హాల్స్
- శుభ్రత, డ్రైనేజీ, నీటి సరఫరా వంటి మౌలిక వసతుల అభివృద్ధి
- ఆధునిక కిచెన్లతో నిర్మాణం
- అర్చకులు, సిబ్బందికి ప్రత్యేక నివాస గృహాలు
- ఆలయ అర్చకులు, వేద పండితులు, సిబ్బందికి ఆధునిక గదులు
- వసతి గృహాలు
- అవిహిత సేవా భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
- అలాగే ప్రజా ప్రతినిధులు, వీఐపీలకు ప్రత్యేక స్వీట్‌లు, క్యార్టర్లు నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
- ధ్యాన మందిరం
- యోగా హాల్
- హోలిస్టిక్ వెల్‌నెస్ సెంటర్
- పరిపాలనా భవనం
- డేటా-కంట్రోల్ రూమ్స్
- సీసీ కెమెరా మానిటరింగ్ వ్యవస్థ నిర్మించనున్నారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా అమరావతిని కేవలం రాజధానిగా కాకుండా, దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆధ్యాత్మిక-సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వెంకటేశ్వర ఆలయ విస్తరణతో అమరావతిలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications