ఎంపి మాగుంట రాజీనామా, ఎమ్మెల్యే సూసైడ్‌యత్నం
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి బుధవారం కాంగ్రెసు పార్టీకి, తన పదవికి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)కు లోకసభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాజ్యసభలోను ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు పలువురు రాజీనామా చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

గాలి, బొజ్జల రాజీనామా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాలకృష్ణ రెడ్డిలు బుధవారం తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వారు స్పీకర్‌కు తమ రాజీనామాలను ఫ్యాక్స్ చేశారు.
ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం
విభజనకు వ్యతిరేకంగా విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు ఆత్మహత్యాయత్నం చేశారు. బుధవారం టిడిపి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కార్యకర్తలు, పోలీసులు అడ్డుకున్నారు.
కిరణ్‌పై జోగి రమేష్ మండిపాటు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. బాల్స్ అన్నీ ఆడి డకౌట్ అయిన కిరణ్ ఇప్పుడు ఎవరికి ఉద్ధరించడానికి రాజీనామా చేశారన్నారు. కాంగ్రెస్, బిజెపి కుట్రపన్ని మూజువాణి ఓటుతో తెలంగాణ బిల్లును ఆమోదించి తెలుగు రాష్ట్రాన్ని చీల్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బిజెపిలతో కలసి చంద్రబాబు విభజన బిల్లుకు సహకరించారన్నారు. రెండు కళ్ల సిద్ధాంతంతో చంద్రబాబు సీమాంధ్ర ప్రజలను మోసం చేశారన్నారు.












Click it and Unblock the Notifications