క్యూ తప్పితే కర్రతో కొట్టండి: ఓటేసిన మోహన్‌బాబు
తిరుపతి: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు చిత్తూరు జిల్లాలోని రంగంపేటలో కాస్తా హల్‌చల్ చేశారు. తన తల్లి, ఇతర కుటుంబ సభ్యులతో పాటు పోలింగ్ బూత్‌కు వచ్చిన మోహన్ బాబు క్యూ వెళ్లి ఓటేయాలని, క్యూలో నిలబడని వారిని కర్రతో కొట్టాలని చెప్పారు. ఆయనతో పాటు కుమారుడు, సినీ హీరో మంచు విష్ణు కూడా ఉన్నారు.
మోహన్ బాబు స్వస్థలం చంద్రగిరి శాసనసభా నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఆయన కాసేపు క్యూలో నిల్చున్నారు. అక్కడి ఓటర్లతో పిచ్చాపాటీగా మాట్లాడారు. మంచివారికి ఓటేయాలని చెప్పారు. ఎవరికి ఓటేశావో చెప్పవద్దు గానీ మంచివారికి ఓటేయాలని ఓ మహిళకు సూచించి ఆయన పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. తన తల్లితో ఆయన ఓటేయించారు.

ఓటేసే సమయంలో ఆయన కొంత అయోమయానికి గురైనట్లు కనిపించారు. కాగా, ఓటేసిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో నీచాతినీచంగా వాగ్దానాలు చేస్తున్నారని, రాజకీయ నాయకుల్లో స్వార్థం పెరిగిపోయిందని ఆయన విమర్శించారు. తాను అట్టడుగు వర్గం నుంచి వచ్చానని ఆయన చెప్పారు.
క్రమశిక్షణ ముఖ్యమని, తాను తన పిల్లలను క్రమశిక్షణతో పెంచానని, తన విద్యాసంస్థల్లో కూడా క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నానని ఆయన చెప్పారు. ఉద్యమ సమయంలో రెండు రాష్ట్రాల్లోనూ కొంత మంది ప్రాణాలు కోల్పోయారని, రెండు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులుగా వచ్చినవారు తొలుత ఆ కుటుంబాల గురించి ఆలోచించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications