మిస్డ్‌కాల్ ప్రేమ: సహజీవనం చేసి పెళ్లి వద్దంటున్నాడు
హైదరాబాద్: అనుకోకుండా కలిసిన ఫోన్ కాల్ ద్వారా పరిచయమైన యువతిని ప్రేమలోకి దించి ఆమెతో మూడేళ్లపాటు సహజీవనం చేశాడు ఓ యువకుడు. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని కోరింది. దీంతో ముఖం చాటేసిన యువకుడు తమ ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని చెప్పిన తప్పించుకోవాలని చూశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. అండమాన్ నికోబార్‌కు చెందిన మొయినుద్దీన్ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వలస వచ్చాడు. ఓ సిమెంట్ దుకాణంలో పని చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసే క్రమంలో కోల్‌కతాకు చెందిన మిత్తు(22)కు మిస్డ్ కాల్ వెళ్లింది. దీంతో ఆమె తిరిగి ఫోన్ చేసింది. ఇద్దరి మధ్య సంభాషణ కొనసాగడంతో పరిచయం పెరిగింది.

పరిచయం ప్రేమగా మారడంతో ఫోన్‌లోనే పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఆమెను హైదరాబాద్ రావాలని కోరాడు మొయినుద్దీన్. దీంతో ఆమె తన తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా వచ్చేసింది. యూసుఫ్‌గూడలో గదిని అద్దెకు తీసుకొని కొన్నేళ్లపాటు సహజీవనం చేశారు. ఈ క్రమంలో మిత్తు గర్భం దాల్చింది. ఆమెను ఎలాగోలా ఒప్పంచి అబార్షన్ చేయించాడు మొయినుద్దీన్.
తనను పెళ్లి చేసుకోవాలని మిత్తు అతడ్ని కోరింది. తన తల్లిదండ్రులు అంగీకరించడం లేదని, వివాహం చేసుకోలేనని ఆమెకు తేల్చి చెప్పాడు మొయినుద్దీన్. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, మొయినుద్దీన్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత అతడ్ని వదిలేయాలని, తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటానని బాధిత యువతి పోలీసులను వేడుకుంది. కేసు నమోదైనదున అతడ్ని విడిచిపెట్టలేమని పోలీసులు ఆమెకు చెప్పారు.












Click it and Unblock the Notifications