చంద్రబాబులా బతకడం కంటే.. వైఎస్సార్ లాంటి చావే గొప్పది.. అదే నా కోరిక: మంత్రి కొడాలి నాని
Recommended Video
''రాజశేఖర్ రెడ్డి మరణం గురించి మాట్లాడే సన్నాసులు, మూర్ఖులకు ఒక విషయం చెప్పదల్చుకున్నా. నాకే గనుక గొప్ప పేరొచ్చి, నా పిల్లలు ఉన్నత స్థానానికి వెళతారంటే కచ్చితంగా వైఎస్సార్ లాంటి మరణాన్నే కోరుకుంటాను. చంద్రబాబు 70 ఏళ్లుగా బతికే ఉన్నారు. బలమైన పార్టీని ఎన్టీఆర్ నుంచి లాగేసుకున్నారు. ఇప్పుడు 23 సీట్లకు పడిపోయారు. కనీసం కొడుకును కూడా గెలిపించుకోలేక ప్రజల చీత్కారాన్ని ఎదుర్కొన్నారు. బాబుగారి బతుకు కంటే వైఎస్సార్ చావు వెయ్యిరెట్లు గొప్పది'' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు మంత్రి కొడాలి నాని. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయనీ కామెంట్లు చేశారు.

రాజధాని ఎక్కడుండాలి?
చంద్రబాబు రాష్ట్రమంతా తిరుగుతూ.. ఆయనకు సంబంధించిన డబ్బా మీడియా.. చెత్త పేపర్లు, సోషల్ మీడియాలో రకరకాలుగా రాయిస్తున్నాడని, అదేదో టేప్ పెట్టి కొలత వేసినట్లు.. అమరావతి కచ్చితంగా రాష్ట్రానికి సెంటర్ పాయింట్ లో ఉందని, కాబట్టి అక్కడే రాజధాని నిర్మించాలని వాదించడం అర్థరహితమని మంత్రి నాని అన్నారు. సుదీర్ఘ అనుభవమున్న రాజకీయనాయకుడిగా చంద్రబాబుకు రాజధానుల గురించి తెలియదా? రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉందా, పక్కనుందా, చివర్లో ఉందా అని ఆలోచిస్తారా ఎవరైనా? అని ఎద్దేవా చేశారు.

ఢిల్లీ ఎక్కడుంది?
‘‘అమరావతిని ఇలా కడతా, అలా కడతానని గతంలో చంద్రబాబు ఆరు నగరాల పేర్లు చెప్పారు. అందులో ఒకటి ఢిల్లీ నగరం. దేశానికి రాజధానిగా ఉన్న ఢిల్లీ.. సెంటర్ పాయింట్ లో ఉందా? కన్యాకుమారి నుంచి ఢిల్లీకి రెండున్నర వేల కిలోమీటర్లు. ఢిల్లీ నుంచి అటువైపు రెండొందల కిలోమీటర్ల లోపే పాకిస్తాన్ బోర్డర్ వస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు సెంటర్ పాయింట్ గురించి మాట్లాడటం అవివేకం అవుంది. చెన్నైగానీ, బెంగళూరు, ముంబై, కోల్ కతా లాంటి నగరాలు ఆయా రాష్ట్రాల్లో ఏ దిక్కున ఉన్నాయో మనకు తెలియదా?‘‘అని మంత్రి కొడాలి విమర్శించారు.

ఆస్తుల బాధ తప్ప మరోటికాదు..
అమరావతిలోనే రాజధాని ఉండాలన్న విషయాన్ని ప్రజలకు ఎలా కన్విన్స్ చేయాలో తెలియకే చంద్రబాబు ఇలాంటి పిచ్చివాదనలన్నీ తెరపైకి తెచ్చారని కొడాలి ఆరోపించారు. రాజధానిని తరలిస్తే తన భూముల విలువలు తగ్గిపోతాయన్న బాధ తప్ప చంద్రబాబుకు ఏరోజూ ప్రజల గురించిన ఆలోచనలే లేవన్నారు.

అమరావతి అనేది పచ్చి మోసం..
చంద్రబాబు చెప్పే అమరావతి నిజానికి పచ్చి మోసమని, దాన్ని పుణ్యక్షత్రంగా, గతంలో బౌద్ధ రాజులు పరిపాలించిన నగరంగా ప్రచారం చేయడం ఇంకా దారుణమని మంత్రి కొడాలి పేర్కొన్నారు. బౌద్ధకాలంనాటి పురాతన అమరావతికి.. చంద్రబాబు క్రియేట్ చేసిన మాయల అమరావతికి మధ్య 25 కిలోమీటర్ల దూరముందని, ఆ పురాతన ప్రదేశాన్ని ఎండబెట్టి, పాడుపెట్టేసిన ఘనత కూడా బాబుదేనని దుయ్యబట్టారు. తక్కువ ఖర్చుతో, తొందరగా ముందుకు దూసుకెళ్లగలిగే, మహానగరాలకు పోటీ ఇవ్వగలిగే రాజధానిని నిర్మించాలన్నదే వైసీపీ ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు.

బాబు వదిలేస్తే జగన్ కట్టాలా?
ప్రైవేటు భూమి కన్నా, ప్రభుత్వ భూమి ఎక్కువ ఉంటేనే రాజధానికి మంచిదని జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే చెప్పారని, ల్యాండ్ పూలింగ్ తో నయాజమీదార్లు, రియల్ ఎస్టేట్ అక్రమాలు పేట్రేగుతాయనీ హెచ్చరించారని మంత్రి కొడాలి గుర్తుచేశారు. జగన్ ప్రకటనను వక్రీకరించి, ఆయనేదో ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు కట్టాలని చంద్రబాబు అడ్డంగా వాదించడం కరెక్ట్ కాదన్నారు. చంద్రబాబు కట్టకుంటే అమరావతిని తాను కడతానని జగన్ ఏరోజూ చెప్పలేదన్నారు.

అమరావతితో ఒరిగిందేంటి?
పిట్టలదొర, పగటివేషగాడిలా చంద్రబాబు మాటలు, రకరకాల గ్రాఫిక్స్ తప్ప అమరావతిలో ఏమీ లేదని, రాజధానిని కట్టడం చేతకాక, ఆ నెపాన్ని వైసీపీ ప్రభుత్వం మీదికి నెట్టేయడానికి కొంచెమైనా సిగ్గుందా అని కొడాలి ప్రశ్నించారు. సెక్రటేరియట్, హైకోర్టు వేరే ప్రాంతానికి తరలించినాసరే అమరావతికి వచ్చే నష్టం ఉండదని, గతంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడుగానీ, తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోగానీ, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలోగానీ క్రిష్ణా, గుంటూరు జిల్లాలు ఎప్పుడూ టాప్ ప్లేస్ లోనే ఉన్నాయని, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎప్పుడూ ముందంజలోనే ఉన్నాయని, అమరావతి వల్ల ఈ ప్రాంతానికి కూడా ఒరిందేమీలేదని మంత్రి నాని అన్నారు.












Click it and Unblock the Notifications