'ఏసీ గదిలో జగన్ నిద్రలేవకముందే చంద్రబాబు ప్రారంభించారు'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ నేతలు, మంత్రులు మంగళవారం నాడు ధ్వజమెత్తారు. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు ఏం చేయలేదన్న జగన్ పైన మంత్రులు కౌంటర్ ఇచ్చారు.

జగన్ ఏసీ గది నుంచే బయటకు రారు
ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతుల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఏసీ గది నుంచి బయటకు రాని జగన్‌కు రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు.

జగన్ నిద్ర లేవకముందే
అలాగే, చంద్రబాబు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయం ఎలా తెలుస్తుందని, వాస్తవాలు ఆయనకు తెలియవని పత్తిపాటి పుల్లా రావు అన్నారు. వైయస్ జగన్ నిద్ర లేవక ముందే చంద్రబాబు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందన్నారు. వైసిపి కాంట్రాక్టర్ పనులతోనే దాచేపల్లి నీట మునిగిందని ఆరోపించారు.

డిపాజిట్లు రావు
వైసిపి అధినేత జగన్ తీరు ఇలాగే ఉంటే భవిష్యత్తులో డిపాజిట్లు కూడా రావని మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు భగ్గుమన్నారు. పోలవరానికి అడ్డుపడి, రాళ్లు వేసే పని మానుకోవాలని హితవు పలికారు. జగన్ విద్రోహశక్తిగా మారాడన్నారు. రాష్ట్ర అభివృద్ధికి జగన్ అడ్డంకిగా మారారన్నారు.

చంద్రబాబుపై జగన్ ఆగ్రహం
సీఎంగా ఉన్న చంద్రబాబు హెలికాప్టర్లలో తిరగడానికే సరిపోయిందని, కానీ వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించే తీరిక లేదని జగన్ విమర్శించిన విషయం తెలిసిందే. వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తే ప్రజల ఇబ్బందులు తెలిసేవన్నారు. టీవీల్లో కనిపించడం కోసం చంద్రబాబు హెలికాప్టర్లో తిరిగారన్నారు.












Click it and Unblock the Notifications