ఎమ్మెల్యే సూరి అనుచరుల వీరంగం: ‘హారన్’ కొట్టారని నలుగురిపై దాడి, తీవ్రగాయాలు
అనంతపురం: నగరంలో సోమవారం ఆర్ధరాత్రి ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి అనుచరులు వీరంగం సృష్టించారు. హారన్ కొట్టారని కారణంతో నలుగురు యువకులను విచక్షణా రహితంగా చితకబాదారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాధితుల తెలిపిన వివరాల ప్రకారం.. నవోదయ కాలనీకి చెందిన నారాయణస్వామి సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి ఎమ్మెల్యే వరదాపురం సూరి ఇంటి సమీపంలో ఎమ్మెల్యే అనుచరులు వేగంగా బైక్‌పై నారాయణ స్వామిని ఓవర్ టేక్ చేశారు.

ఈ క్రమంలో నారాయణస్వామి హారన్ కొట్టగా ఎమ్మెల్యే అనుచరుడు 'ఏరా నేను వెళ్తుంటే హారన్ కొడతావా' అంటూ దుర్భాషలాడారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే అనుచరుడు కొంతమందిని తీసుకొచ్చి రోడ్డుపైనే నారాయణస్వామిని చితకబాదారు.
తనను వదిలేయాలని నారాయణస్వామి కాళ్లు పట్టుకుని వేడుకున్నా వినకుండా తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత నారాయణస్వామి హౌసింగ్ బోర్డుకు వెళ్లి తన బంధువు అయిన రాజశేఖర్‌కు ఫోన్లో సమాచారం అందించాడు. రాజశేఖర్ తోపాటు చిరంజీవి, అనిల్ కుమార్‌లు కలిసి ఎమ్మెల్యే నివాసం వెళ్లారు.
నారాయణస్వామిని ఎందుకు కొట్టారని ఎమ్మెల్యే అనుచరులను ప్రశ్నించారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఎమ్మెల్యే అనుచరులు.. వారిని కూడా చితకబాదారు. వారి మెడలోని గొలుసు, బ్రాస్‌లెట్‌ను లాగేసుకున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ నారాయణస్వామి, రాజశేఖర్‌లను చికిత్స నిమిత్తం 108లో ఆస్పత్రికి తరలించారు. రాజశేఖర్‌కు తలపై ఎనిమిది కుట్లు పడటం గమనార్హం. ఘటనపై ఆరా తీసిన టూటౌన్ ఎస్ శివగంగా రెడ్డి.. దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications