బాబు బాటలో కెసిఆర్: తెరాసలోకి 9 మంది ఎమ్మెల్సీలు
హైదరాబాద్: ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలను చేర్చుకునే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మార్గంలో నడుస్తున్నట్లు కనిపిస్తున్నారు. శాసనమండలిలో కూడా తన బలాన్ని పెంచుకుని చైర్మన్ పదవిని దక్కించుకునే యోచనలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఉంది. తద్వారా స్వామిగౌడ్‌ను మండలి చైర్మన్ చేయడానికి కెసిఆర్ పావులు కదుపుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, సిర్పూర్ కాగజ్‌నగర్ శాసనసభ్యులు ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్పలు బుధవారం కెసిఆర్ సమక్షంలో తెరాసలో చేరనున్నారు. వారిద్దరు బిఎస్పీ తరఫున గెలిచారు. ఎమ్మెల్సీలు పూల రవీందర్, జనార్దన్ రెడ్డి, కాంగ్రెసుకు చెందిన ఎమ్మెల్సీలు భాను ప్రసాద్ రావు, భూపాల్ రెడ్డి, రాజలింగంలతో పాటు 9 మంది ఎమ్మెల్సీలు తెరాసలో చేరనున్నారు.

ప్రస్తుతం తెరాసకు నలుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. తాజాగా, గవర్నర్ కోటాలో నాయని నర్సింహారెడ్డి, రాములు నాయక్ ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. కొత్తగా చేరే 9 మందితో తెరాస బలం మండలిలో 15కు పెరుగుతుంది. వారితో పాటు త్వరలో మరింత మంది కాంగ్రెసు, టిడిపి ఎమ్మెల్సీలు తెరాసలో చేరుతారని భావిస్తున్నారు.
శాసన మండలిలో ప్రస్తుతం 32 మంది సభ్యులున్నారు. తాజాగా చేరేవారి బలంతో తెరాస మండలిలో ఆధిక్యంలోకి వస్తుంది. తద్వారా చైర్మన్ పదవిని దక్కించుకునే ఎత్తుగడలో తెరాస ఉంది. స్వామిగౌడ్‌కు మంత్రి పదవి ఇస్తానని కెసిఆర్ హామీ ఇచ్చారు. కానీ అది కుదరడం లేదు. ఈ స్థితిలో ఆయనను శాసన మండలి చైర్మన్‌గా చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. మంగళవారం సాయంత్రం 3 గంటలకు డజన్ మంది దాకా ఎమ్మెల్సీలు తెరాసలో చేరుతారని అంటున్నారు.












Click it and Unblock the Notifications