మంత్రి వర్సస్ ఎంపీ - ఓడించి తీరతాం, సీటు దక్కేదెవరికి..!!
ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ నేతల ఆధిపత్య పోరు తెర మీదకు వస్తోంది. గోదావరి జిల్లాల కేంద్రంగా రాజకీయం సాగుతున్న సమయంలో వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి, ఎంపీ పిల్లి సుభాస్ చంద్ర బోస్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరుకుంది. ఈ పరిణామాలపైన సీఎం జగన్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. దీంతో ఏం జరుగుతోందనే ఆసక్తి మొదలైంది.
Recommended Video

మంత్రి వేణు పై ఆగ్రహం:డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం రూరల్ మండలం ద్రాక్షారామలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. మంత్రి వేణు..ఆయన కుమారుడు లక్ష్యంగా వైసీపీ కార్యకర్తలు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మంత్రి వేణుకు వ్యతిరేకంగా..

ఎంపీ బోసుకు అనుకూలంగా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. సమావేశానికి మండల కన్వీనర్ పోలినాటి ప్రసాద్ అధ్యక్షత వహించారు. మాజీ జడ్పీటీసీ ఇంత సంతోషం మాట్లాడుతూ.. ఎంపీ నిధులను కూడా నియోజకవర్గంలో ఖర్చు చేయకుండా మంత్రి అడ్డుకున్నారని ఆరోపించారు.ఒక్కొక్కరు మంత్రి వేణు లక్ష్యంగా అవినీతి ఆరోపణలు చేసారు. 2019 ఎన్నికల్లో బోసు మాట పైన గౌరవంత వేణు గెలుపు కోసం పని చేసామని చెప్పుకొచ్చారు.
మంత్రికి సీటు ఇవ్వద్దంటూ:సభలో ఒక్కొక్కరుగా మంత్రి వేణుపై విమర్శలు గుప్పించారు. మంత్రి కుమారుడు నరేన్ రియల్ ఎస్టేట్ దందాలు, భూముల కబ్జాలు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పార్టీ కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టిన కీలక కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి రౌడీషీట్లు ఓపెన్ చేస్తున్నారని విమర్శించారు.
నియోజకవర్గానికి ఒంటరిగా వచ్చి ఇళ్లు, ఇతర ఆస్తులు ఎలా కూడగట్టారో సీఎం తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ బోస్ సహకారంతో నియోజకవర్గంలో గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత బోస్ వర్గీయులు వేణు దగ్గరికి వెళ్తే వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, కక్ష సాధింపులకు దిగడమేమిటని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం నుంచి వేణుకు టికెట్ ఇవ్వొద్దని.. బోస్ తనయుడు సూర్యప్రకాశ్‌కు కేటాయించాలని నాయకులు డిమాండ్ చేశారు.

సీఎం జగన్ హామీ ఇచ్చారు:ఒకవేళ మంత్రి వేణుకు టికెట్ ఇస్తే ఆయన్ను ఓడించి బోస్ తనయుడిని గెలిపించుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సభలో చేసిన ఆరోపణలపై మంత్రి వేణు స్పందించారు. కృష్ణార్పణమంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రామచంద్రాపురం అభ్యర్ధి తానేనని సీఎం జగన్ చెప్పారని మంత్రి పేర్కొన్నారు.
రానున్న ఎన్నికల్లో అక్కడ నుంచే పోటీ చేస్తానన్నారు. తన పైన మాట్లాడే వారు చరిత్ర లేని వారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎంపీ బోసు తనకు గురువని వ్యాఖ్యానించన మంత్రి..ఆయన మాట్లాడి ఉంటే స్పందించే వాడినని..మిగిలిన వారు ఎవరు మాట్లాడినా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 26న సీఎం జగన్ అమలాపురం పర్యటన వేళ ఈ పరిణామాలు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications