చిరు-దాసరిని ఏకం చేసిన బాబు, ముద్రగడ వెనుక... 'డబుల్' ధమాకా
హైదరాబాద్: బద్ధ శత్రువులుగా ప్రచారంలో ఉన్న మాజీ కేంద్రమంత్రులు చిరంజీవి, దాసరి నారాయణ రావులు ఏకమయ్యారు! కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో వీరిద్దరు బయటకు వచ్చారు. వీరిద్దరు కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేశారు.
కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, తుని ఘటనలో అరెస్టు చేసిన అమాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాపు నేతలు హైదరాబాదులో భేటీ అయ్యారు.
ఈ భేటీకి కాంగ్రెస్ కాపు నేతలు చిరంజీవి, పళ్లం రాజు, సీ రామచంద్రయ్య, వైసిపి నేతలు బొత్స సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబు, దర్శకరత్న దాసరి నారాయణ రావు తదితరులు భేటీ అయ్యారు. ముద్రగడ దీక్ష నేపథ్యంలో విపక్షాలు ఒక్కటయ్యాయి.
అలాగే, దాసరి, చిరంజీవిలు కూడా ఒక్కటయ్యారు. వీరి మధ్య విభేదాలు ఉన్నట్లుగా ఎప్పటి నుంచో వాదనలు ఉన్నాయి. అయితే, కొద్ది రోజుల క్రితం కూడా ఇరువురు ఓ వేడుకలో కనిపించారు. కాపులకు హామీలు, ముద్రగడ దీక్ష నేపథ్యంలో... విపక్షాలను, చిరు-దాసరిని ఏపీ సీఎం చంద్రబాబు ఏకం చేశారని చెప్పవచ్చు.

ముద్రగడ దీక్షను క్యాష్ చేసుకునే పోటీయా?
ముద్రగడ దీక్షను ఎవరికి వారు క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ముద్రగడ దీక్షకు అడపాదడపా మద్దతు పలికినప్పటికీ.. కాపులు ఆశించిన స్థాయిలో కీలక కాపు నేతల నుంచి మద్దతు లభించలేదనే వాదన ఉంది. ఇప్పుడు ముద్రగడ దీక్ష చేస్తున్నారు. ఆయనకు కాపుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.
తుని ఘటనలో తాము వీడియో ఫుటేజీ ఆధారంగా, ఆధారాలతో నిందితులను మాత్రమే అరెస్టు చేశామని, అమాయకుల జోలికి వెళ్లమని, అలాగే కాపులకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. అయితే, ముద్రగడ... అవి తప్పుడు అరెస్టులు అని చెప్పి దీక్షకు దిగారు.
ఆయన దీక్ష మంగళవారం నాటికి ఆరో రోజుకు చేరుకుంది. తొలుత ముద్రగడ దీక్ష వెనుక వైసిపి అధినేత జగన్ ఉన్నారని టిడిపి నేతలు ఆరోపించారు. కానీ వైసిపి లేదని, కానీ తమ మద్దతు ముద్రగడకు ఉంటుందని వైసిపి ప్రకటించింది.
ముద్రగడ వెనుక జగన్ ఉన్నాడనే వాదనను వైసిపి నేతలు ఖండించినప్పటికీ... ఆ ప్రచారం బాగా జరిగింది. దీంతో, ఏం జరిగినా క్రెడిట్ వైసిపికి వెళ్లిపోతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తోందని, అందుకే ఆ పార్టీ నేతలు మద్దతు పలుకుతున్నారని అంటున్నారు. ముద్రగడ వెనుక మేం ఉన్నామని అన్ని పార్టీల కాపు నేతలు చెబుతున్నారు.
ముద్రగడ దీక్షను క్యాష్ చేసుకునేందుకు వైసిపి, కాంగ్రెస్ పార్టీలో పోటీ పడుతున్నాయని అంటున్నారు. విపక్షాలన్నీ సోమవారం భేటీ అయినప్పటికీ... గత ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన కాపులను టిడిపికి దూరం చేయడం వారి మొదటి లక్ష్యమని, రెండో లక్ష్యం.. ముద్రగడ దీక్షను క్యాష్ చేసుకోవడమనే వాదనలు వినిపిస్తున్నాయి. అంటే కాంగ్రెస్, వైసిపిలు పోటీ పడుతున్నాయంటున్నారు.
కాగా, సోమవారం భేటీ అయిన కాపు నేతలు చంద్రబాబుకు రెండు రోజుల గడువు ఇచ్చి, అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. రెండ్రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
సమావేశంలో ముఖ్యంగా ఏడు తీర్మానాలు చేశారు. ముద్రగడ దీక్కు అండ, ఆయన ఆరోగ్య పరిస్థితి పైన ఆందోళన, ముద్రగడ ఇంటి తలుపులు పగులగొట్ట నిర్బంధించిన విదాం, మహిళలని చూడకుండా భార్యా, కోడళ్ల పట్ల నేరస్తుల కంటే హీనంగా ప్రవర్తించడం, 144 సెక్షన్ విధించడం, ఛానళ్ల ప్రసారాల నిలిపివేత, అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులతో ప్రభుత్వం ఎదురు దాడి చేయించడాన్ని వారు ఖండించారు.












Click it and Unblock the Notifications