సైకిల్ గాలే ఉంది: మురళీమోహన్, వంద సీట్లు: సోమిరెడ్డి
హైదరాబాద్/ నెల్లూరు : రాజమండ్రి నియోజకవర్గంలోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ విజయం ఖాయమని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మురళీమోహన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత పోలింగ్ సరళి సైకిల్ గాలికి నిదర్శనమని ఆయన అన్నారు. రాజమండిలో ఏడు స్థానాల్లోనూ టీడీపీ గెలుస్తుందని ఆయన గురువారం ధీమా వ్యక్తం చేశారు. ఎక్కువగా మహిళల ఓట్లు తనకు కలిసి వచ్చాయని ఆయన అన్నారు.
తెలుగుదేశం, బిజెపి కూటమికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని రాజమండ్రి నగర బిజెపి అభ్యర్థి ఆకుల సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఎంపీ స్థానాలు తమవేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీమాంధ్రలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని సత్యనారాయణ అభిప్రాయపడ్డారు.

ఇదిలావుంటే, సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీదే అధికారమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి 100 సీట్లు ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో తమ పార్టీదే విజయమని ఆయన గురువారం మీడియాతో అన్నారు. బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు సహకారంతో పాటు పలు అంశాలు తనకు కలిసివచ్చాయని సోమిరెడ్డి అన్నారు. సర్వేపల్లిలో 15 వేలకు పైగా మెజారిటీ సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సీమాంధ్రలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని టిడిపి నెల్లూరు నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. టిడిపి కార్యకర్తలను ఆదుకుంటామని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీలు, గూండాలను తరిమికొడతామని చెప్పారు.












Click it and Unblock the Notifications