సిమి కార్యకలాపాల్లేవ్: నాయిని, ఉగ్రవాది డెడ్‌బాడీ కోసం తండ్రి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సురక్షిత ప్రాంతమని, ఇక్కడ సిమి ఉగ్రవాదుల కార్యకలాపాలు జరగడం లేదని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి సోమవారం అన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదన్నారు.
ఉగ్రవాదుల అనుచరుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల పోలీసు బలగాలు విస్తృత తనిఖీలు చేస్తున్నాయన్నారు. సూర్యాపేటలో తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
సిద్ధయ్యను పరామర్శించిన కేసీఆర్
జానకీపురం ఎన్‌కౌంటర్లో గాయపడ్డ ఎస్సై సిద్ధయ్య కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మధ్యాహ్నం పరామర్శించారు. కామినేని ఆసుపత్రిలో ఆయన పరామర్శించారు. వైద్యులను ఎస్సై ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వెంట హోంమంత్రి నాయిని, సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మలు ఉన్నారు.

మోత్కూరు మండలంలోని జానకీపురంలో జరిగిన సిమి ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్‌ఐ సిద్ధయ్య త్వరగా కోలుకోవాలని అకాంక్షిస్తూ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక బ్రాహ్మణవాడ శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముష్కరుల కాల్పులలో మృతిచెందిన నాగరాజు కుటుంబానికి మేలు కలగాలని ప్రార్థనలు చేశారు.
కొడుకు మృతదేహం కోసం వచ్చిన ఉగ్రవాది తండ్రి
ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఒక ఉగ్రవాది మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆయన తండ్రి, సోదరుడు నల్గొండ జిల్లాకు వచ్చారు. నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రిలో ఉన్న కొడుకు మృతదేహాన్ని తమకు అప్పగిస్తే అంత్యక్రియలు చేసుకుంటామని కోరారు.
దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో ఆరో నిందితుడు ఆజాద్‌షేక్
దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో ఆజాద్‌షేక్ అనే వ్యక్తిని ఆరో నిందితుడిగా చేర్చారు. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్న ఎన్ఐఏ ఆజాద్ షేక్‌ను కోర్టులో హాజరుపరచింది. ఇండియన్ ముజాహిదిన్ ఉగ్రవాదులకు సిమ్‌కార్డులను సమకూర్చింది ఇతడే అని ఎన్ఐఏ, కోర్టుకు వివరించింది.












Click it and Unblock the Notifications