నాలాంటోళ్లు చెప్తే బాబునెలా అడుగుతారు!: జగన్‌కు సునీత ట్విస్ట్
విజయవాడ/హైదరాబాద్: చంద్రబాబు కేబినెట్లోని మంత్రి పరిటాల సునీత సోమవారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రైతులు బ్యాంకులలో తీసుకున్న ప్రతి రుణాన్ని మాఫీ చేస్తానని చంద్రబాబు ఏనాడు చెప్పలేదని ఆమె అన్నారు. తనలాంటి నేతలు చెప్పే వాటికి చంద్రబాబు బాధ్యత ఎలా వహిస్తారని చెప్పారు.
కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు రుణమాఫీ మొత్తం చేస్తానని ఇప్పుడు షరతులు విధించడమేమిటని ప్రశ్నించిన విషయం తెలిసిందే. వైసీపీ ఆధ్యక్షులు జగన్, ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డిలు కూడా దీనిని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు మొత్తం రుణమాఫీ అని, ఇప్పుడు షరతులు విధిస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబుకు రామకృష్ణ చురకలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సెటైర్లు వేశారు. రాజ్యాంగం అనుమతిస్తే సింగపూర్‌వాసులను కూడా బాబు తన మంత్రివర్గంలో చేర్చుకుంటారేమోనని వ్యాఖ్యానించారు. ఇంతవరకు ఒక్క పైసా రుణమాఫీ చేయకుండానే సన్మానాలు చేయించుకుంటున్నాడని ఆరోపించారు.
రుణమాఫీ విషయంలో చంద్రబాబు వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అనుసరించి రుణమాఫీ చేయాల్సిందేనన్నారు. ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తి సాధించడంలోనూ చంద్రబాబు విఫలమయ్యారని రామకృష్ణ విమర్శించారు.
ఏడీబీ బృందం రాక!
పారిశ్రామికాభివృద్ధి కోసం తలపెట్టిన వైజాగ్ -చెన్నై కారిడార్ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) బృందం విశాఖ జిల్లాలో ఈ నెల 11, 12 తేదీల్లో పర్యటించనున్నది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఈ బృందం విశాఖతో పాటు చిత్తూరు జిల్లాల్లో కూడా పర్యటిస్తుంది.
ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమావేశమై విశాఖ - చెన్నై మధ్య పరిశ్రమల అభివృద్ధికి ఉన్న అవకాశాలపై చర్చించి, నివేదికను రూపొందిస్తుందని జిల్లా అధికారులు తెలిపారు. ఏడీబీ బృందం ఎనిమిది నుంచి పదోతేదీ వరకు హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి అధికారులతో ఈ బృందం సమావేశం అవుతుంది.












Click it and Unblock the Notifications