టిడిపి, చిరంజీవి: జూ ఎన్టీఆర్ దార్లో పవన్ కళ్యాణ్!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సహ నటుడు జూనియర్ ఎన్టీఆర్ దారిలో వెళ్తున్నారా!? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ పట్ల జూనియర్ అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన 2019ని లక్ష్యంగా పెట్టుకున్నారనే వాదనలు గతంలో వినిపించాయి.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా 2019ని టార్గెట్‌గా పెట్టుకున్నారు. అయితే, ఎన్టీఆర్ పార్టీని పెట్టకుండా.. పవన్ పార్టీని స్థాపించి టార్గెట్‌గా పెట్టుకున్నారని అంటున్నారు. తన సోదరుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసినప్పటి నుండే పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

పవన్ అసంతృప్తి పలు సందర్భాలలో బయటపడింది. మెగా కుటుంబ సభ్యులు దానిని ఖండిస్తూ వచ్చినప్పటికీ... పవన్ జనసేన పార్టీని స్థాపించడంతో అది బయటపడింది. జనసేన పార్టీ స్థాపించిన పవన్... మల్కాజిగిరి లేదా కాకినాడ నుండి పోటీ చేస్తారని, ఆయన పార్టీ 40 స్థానాల వరకు పోటీ చేసే అవకాశముందని ఊహాగానాలు వినిపించాయి.
కానీ, పవన్ మాత్రం కాంగ్రెసు పార్టీ వ్యతిరేక ఓట్లు చీలవద్దనే ఉద్దేశ్యంతో తాను పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. ప్రధానమంత్రిగా బిజెపి అభ్యర్థి నరేంద్ర మోడీకి ఓటేయాలని చెప్పారు. రాష్ట్రంలో ఎవరికి ఓటేయాలనే విషయం నేరుగా చెప్పనప్పటికీ పరోక్షంగా టిడిపికి ఓటేయాలని చెప్పినట్లుగా అందరు భావిస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే వారికే ఓటేయమని పవన్ సూచించారు.
గత ఏడాది టిడిపిలో జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ అంశం తారాస్థాయికి చేరుకుంది. చంద్రబాబు నారా లోకేష్ ఆరంగేట్రం కోసం ఎన్టీఆర్‌ను క్రమంగా పక్కకు పెట్టారంటున్నారు. దీనిని సహించలేని హరికృష్ణ, జూనియర్‌లు ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఈ ఎన్నికల్లో పరోక్షంగా మద్దతివ్వవచ్చుననే ప్రచారం జరిగింది. ఇప్పటికి రాజకీయాలకు ఎన్టీఆర్ దూరంగా ఉన్నప్పటికీ... 2019ని ఆయన టార్గెట్ పెట్టుకున్నారనే వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications