పొత్తుతో ఎన్ని సీట్లు వస్తాయనేది పవన్ కల్యాణ్ అంచనా!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇక నుంచి మరో ఎత్తు.. అన్న రీతిలో రాజకీయాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కనీస సంఖ్యలో 30 నియోజకవర్గాల్లోనైనా జనసేన పార్టీని గెలిపించాలని ప్రణాళికలు రచించుకున్నారు. వాస్తవానికి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి.

పొత్తులో భాగంగా 40 రావొచ్చు!
ఈ పొత్తులో భాగంగా తనకు 40 సీట్లు వస్తాయని జనసేన అంచనా వేస్తోంది. ఈ 40 నియోజకవర్గాలను తమకు బలమున్న ఉభయ గోదావరి జిల్లాలతోపాటు, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల నుంచి తీసుకోవాలని యోచిస్తోంది. 2029 ఎన్నికల్లో సింగిల్ గా పోటీచేసి అధికారం చేజిక్కించుకోవాలనేది పవన్ కల్యాణ్ వాస్తవ ప్రణాళిక. అందుకు పునాదిని 2024లో వేసుకుంటున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబట్టే బలం లేకపోయినప్పటికీ పొత్తులో భాగంగా 40 నియోజకవర్గాలుంటే చాలని భావిస్తున్నారు.

40లో 30 గెలవాలి
దీనివల్ల ఈ 40లో కనీసం 30 నియోజకవర్గాల్లో విజయం సాధించాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు. అసెంబ్లీలో తనతోపాటు మరో 30 మంది ఎమ్మెల్యేలుంటే వారిద్వారా 2029 ఎన్నికలకు గట్టి పునాది పడుతుందని అంచనా వేస్తున్నారు. 2029 ఎన్నికల సమయానికి రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల్లో ఏది బలహీనపడితే ఆ పార్టీకి సంబంధించి నేతలందరినీ జనసేనలోకి ఆహ్వానించి పార్టీని పటిష్టం చేయాలనే యోచనలో ఉన్నారు. దీనిద్వారా అన్ని నియోజకవర్గాల్లో పార్టీకి నాయకులు దొరకడంతోపాటు ఎన్నికలను బలంగా ఎదుర్కోవడానికి వీలు కలుగుతుందని భావిస్తున్నారు.

బీజేపీతో వెళితే లక్ష్యాన్ని చేరుకోలేం?
2024 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుద్వారా వెళితే తన ప్రణాళిక దెబ్బతింటుందని, కనీసం ఒక శాతం కూడా ఓటుబ్యాంకు లేని బీజేపీని జనసేన మోయాల్సి వస్తుందని, అలా కాకుండా టీడీపీతో పొత్తు పెట్టుకొని వెళితే 2029లో తన లక్ష్యానికి చేరుకోగలమని భావిస్తున్నారు. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలుంటే వారిద్వారా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించి పటిష్టం చేసుకోవాలని, అవినీతికి దూరంగా నిజాయితీపరులైన నాయకులనే జనసేనలోకి తీసుకోవాలని యోచిస్తున్నారు.












Click it and Unblock the Notifications