జగన్ కాంక్షే చీల్చింది: పవన్, బిజెపిలోకి కావూరి

పశ్చిమగోదావరి: పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో సీమాంధ్ర ఎంపీలపై దాడి చూసి తను తీవ్రంగా బాధపడినట్లు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్ర విభజన తనకు బాధ కలిగించిందని అందుకే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఆయన గురువారం పశ్చిమగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన సభలో పాల్గొని ప్రసంగించారు. ఓదార్పు యాత్రలు తప్ప తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడటం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలియదని పవన్ అన్నారు.

సీమాంధ్ర ప్రజలను విమర్శిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావుపై జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడ మాట్లాడటం లేదని అన్నారు. సీమాంధ్ర పౌరుషం లేదా అని జగన్మోహన్ రెడ్డిని పవన్ ప్రశ్నించారు. విభజనతో రెండు రాష్ట్రాలను పంచుకోవాలని కెసిఆర్, జగన్‌లు భావించారని ఆరోపించారు. జాతీ సమగ్రతను కాపాడ గలిగే నాయకుడు నరేంద్ర మోడీ, సీమాంధ్రను అభివృద్ధి చేయగల చంద్రబాబుకు తన మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు తన బంధువు కాదని, మద్దతు ఇవ్వడం వల్ల తనకు పైసా ఆదాయం కూడా లేదని, సీమాంధ్ర ప్రజల అభివృద్ధి కోసమే చంద్రబాబుకు తాను మద్దతిస్తున్నట్లు తెలిపారు.

 Pawan Kalyan fires at YS Jagan

రాజధాని నిర్మించాలంటే అనుభవం కావాలని, అనుభవం లేని జగన్ ఏమి చేయలేడని పవన్ తెలిపారు. అందుకే తాను అనుభవం కలిగిన చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. ఎప్పుడూ చంద్రబాబును విమర్శించే జగన్.. కెసిఆర్‌ను మాత్రం విమర్శించడం లేదని అన్నారు. ఓరేయ్ ఆంధ్రోడా అంటే పౌరుషం రాదా అని ప్రశ్నించారు. సీమాంధ్రకు జగన్ సిఎం కాలేడని అన్నారు. టిలో కెసిఆర్, సీమాంధ్రలో జగన్ అవినీతిని చీల్చి చండడానికి ఏమాత్రం వెనుకాడనని పవన్ చెప్పారు. దేశంలో బిజెపి, సీమాంధ్రలో టిడిపి ప్రభుత్వం రావాలని అన్నారు.

జగన్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలి: చంద్రబాబు

కాంగ్రెస్ పార్టీ అప్పడే చచ్చిపోయిందని, ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. తాను కూడా విభనను తట్టుకోలేకపోయానని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ పార్టీకి డిపాజిట్లు రావొద్దని అన్నారు. తల్లికొడుకులు కలిసి దేశాన్ని సర్వనాశనం చేశారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలనుద్దేశించి వ్యాఖ్యానించారు.

జగన్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆరోపించారు. కెసిఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ ఒకరినొకరు ఎప్పుడూ తిట్టుకోరని తెలిపారు. తనది, నరేంద్ర మోడీది అభివృద్ధి బాట అయితే.. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలది అవినీతి బాట అని అన్నారు. సీమాంధ్ర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం రావాలని అన్నారు. నరేంద్ర మోడీ సహకారంతో సీమాంధ్రను సింగపూర్ చేస్తానని చంద్రబాబు చెప్పారు.

బిజెపిలో చేరిన కావూరి

మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కావూరి సాంబశివరావు.. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సమక్షంలో బిజెపిలో చేరారు. పార్టీ కండువా కప్పి కావూరిని పార్టీలోకి ఆహ్వానించారు మోడీ. ఈ సందర్భంగా కావూరి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రాజులు, రాణులు పాలించారని.. ఇప్పుడు పేద కుటుంబానికి చెందిన నరేంద్ర మోడీ ప్రధాని అవుతున్నారని తెలిపారు. దేశాన్ని నరేంద్ర మోడీ నిస్వార్థంగా అభివృద్ధి చేస్తారని చెప్పారు. మోడీతో కలిసి పని చేసేందుకే తాను బిజెపిలో చేరుతున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్‌ను సాగనంపాలి: మోడీ

కాంగ్రెస్, అమ్మాకొడుకుల పాలనను సాగనంపేందుకు ప్రజలు నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను ఉద్దేశించి నరేంద్ర మోడీ అన్నారు. భీమవరంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో శక్తిమంతమైన ప్రభుత్వాన్ని, అదే విధంగా సీమాంధ్రలో కూడా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం అన్ని రంగాల్లో వెనక్కి వెళ్లిందని చెప్పారు.

కాంగ్రెస్ అవినీతి పాలనతో దేశ ప్రతిష్ట మసకబారిపోయిందని మోడ విమర్శించారు. ఇప్పుడు దేశంలో అభివృద్ధి కావాలని, అందుకే బిజెపిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిర్మిస్తామని చెప్పారు. అవినీతి, నేరగాళ్లకు, జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చిన వారిని రాజకీయాల్లో నుంచి సాగనంపాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టును కోరతామని, ఏడాదిలోగా విచారణ జరిపి దోషులుగా తేలితే వారిని జైలుకు పంపుతామని అన్నారు. మంచి పాలన కావాలన్నా, సీమాంధ్ర స్వర్ణాంధ్రగా కావాలన్న టిడిపి, బిజెపిలను గెలిపించాలని ప్రజలను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+