ముందుకే: అన్నయ్య చిరంజీవితో పవన్ కళ్యాణ్ ఢీ
హైదరాబాద్: తన అన్నయ్య, కేంద్ర మంత్రి చిరంజీవి కారణంగా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టే విషయంపై వెనక్కి తగ్గవచ్చునని భావించారు. కానీ, తాజా పరిణామాలను చూస్తే ఆయన ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. ఈ నెల 14వ తేదీన తన పార్టీ పేరును పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని కచ్చితమైన వార్తలు వస్తున్నాయి. ఆయన పార్టీ పేరు జనసేనగా చెబుతున్నారు.
సీమాంధ్ర (ఆంధ్రప్రదేశ్) కాంగ్రెసు ప్రచార కమిటీ చైర్మన్‌గా చిరంజీవి నియమితులయ్యారు. ఈ స్థితిలో కాంగ్రెసు ప్రచార బాధ్యతను చిరంజీవి మోయాల్సి వస్తుంది. తన పార్టీకి పవన్ కళ్యాణ్ ప్రధాన ప్రచార సారథి అనే విషయం వేరుగా చెప్పనక్కర లేదు. ప్రచారంలో అన్నయ్యపై పవన్ కళ్యాణ్ ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తికరంగా మారనుంది.

కాంగ్రెసు పార్టీ ప్రచార సారథిగా చిరంజీవి తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను లక్ష్యం చేసుకుని వాగ్బాణాలు సంధించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ పార్టీపై ఆయన ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తారు, గుర్తించనట్లు వ్యవహరిస్తారా అనేది కూడా చూడాల్సిందే. కానీ, పోరాటం మాత్రం అన్నదమ్ముల మధ్య తప్పేట్లు లేదు. చిరంజీవికి ప్రధాన బాధ్యతలు అప్పగిస్తే పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గవచ్చునని భావించారు. కానీ, దాన్ని పవన్ కళ్యాణ్ పట్టించుకున్నట్లు లేరు.
పవన్ కళ్యాణ్ పోటీ చేసినా తెలంగాణలో తక్కువే. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆయన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. ఆయన ప్రధాన యుద్ధభూమి సీమాంధ్రనే కానుంది. దీంతో చిరంజీవిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనివార్యంగా ఆయనకు వస్తుంది. చిరంజీవిని నేరుగా కాకున్నా కాంగ్రెసుపై ఆయన వ్యాఖ్యలు చేయడం ఖాయమని అంటున్నారు. గత ఎన్నికల్లోనే ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ కాంగ్రెసుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఇప్పటికీ ఎవరూ మరిచిపోలేదు.
రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పవన్ కళ్యాణ్ దానికి కాంగ్రెసు పార్టీని, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కారణంగా చూపిస్తూ వ్యాఖ్యలు చేసే అవకాశాలు లేకపోలేదు. ఎంత సానుకూల వైఖరితో ముందుకు పోవాలిన అనుకున్న రాజకీయ ప్రత్యర్థులను తిప్పికొట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ చిరంజీవికి ఇబ్బంది కలిగించే అవకాశాలుంటాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications