టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటులో కీలక పరిణామం - ఇదీ లెక్క..!!
ఏపీ ఎన్నికల వేళ రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ, జనసేన పొత్తులో సీట్ల సర్దుబాబు కొలిక్కి వస్తోంది. జనసేనకు ఇచ్చే సీట్ల పైన చంద్రబాబు దాదాపు క్లారిటీ ఇచ్చారు. పవన్ మాత్రం తమకు మరిన్ని సీట్లతో పాటుగా స్థానాల పైన పట్టు బడుతున్నారు. ఇద్దరు నేతల మధ్య ఈ రోజు కీలక సమావేశం జరుగుతోంది. బీజేపీ వైఖరి పైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ వారంలోనే అభ్యర్దులను ప్రకటించాలని నిర్ణయించారు.
కీలక చర్చలు : టీడీపీ, జనసేన పొత్తులో సీట్ల వ్యవహారం పైన కీలక చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రాధమికంగా సీట్ల సర్దుబాటు పైన చర్చించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ రోజు దాదాపు తుది నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. జనసేనకు సర్దుబాటులో భాగంగా 22-25 సీట్ల వరకు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనికి పవన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తనకు ప్రతీ పార్లమెంట్ పరిధిలో ఒక సీటు కేటయించాలని కోరుతున్నారు. అదే విధంగా గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖలో ఎక్కువ సీట్లు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. 45 సీట్లకు తమ అభ్యర్దులతో సహా పవన్ జాబితా సిద్దం చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

ఎవరికెన్ని సీట్లు : ఈ రోజు ఉండవల్లిలో చంద్రబాబు, పవన్ మధ్య భేటీ సీట్ల వ్యవహారం పైన నిర్ణయం దిశగా జరుగుతోంది. గోదావరి జిల్లాల్లో 8, విశాఖలో 3, క్రిష్టాలో 2, గుంటూరు -1, ప్రకాశంలో 2, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో సీటు చొప్పున చంద్రబాబు ప్రతిపాదించినట్లు సమాచారం. కానీ, పవన్ లెక్కలు వేరుగా ఉన్నాయి. గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖలో సీట్లు పెంచాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. తన జాబితాతో చంద్రబాబుతో చర్చలు చేస్తున్నారు. దీని పైన చంద్రబాబు స్పందన కీలకంగా మారుతోంది. ఇదే సమయంలో బీజేపీ తమతో కలిసి వస్తుందని ఇంతకాలం వేచి చూసిన చంద్రబాబు, పవన్ నెక్స్ట్ ఏం చేయాలనే దాని పైన నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

ఎన్నికల కార్యాచరణ : బీజేపీతో చివరి ప్రయత్నాలు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ నెల 10వ తేదీ వరకు బీజేపీ కోసం వేచి చూసి..రాకుంటే ఇక తమ ఎన్నికల కార్యాచరణ అమలు చేసే దిశగా ఇద్దరు అధినేతలు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ముందుకు రాకపోతే సీపీఐతో కలిసి వెళ్లాలనేది వీరి అభిమతంగా చెబుతున్నారు. అటు వైసీపీ ఇప్పటికే అభ్యర్దులను ఖరారు చేస్తూ ప్రచారం ప్రారంభించింది. ఇంకా ఆలస్యం చేస్తే నష్టం జరుగుతుందని ఇద్దరు నేతలు భావిస్తున్నారు. దీంతో, ఈ రోజు జరిగే సమావేశంలో రెండు పార్టీల సీట్లు, మేనిఫెస్టో అంశాల పైన చర్చించటంతో పాటుగా ఎన్నికల కార్యాచరణ పైన ఒక నిర్ణయానికి వచ్చ అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications