11 రోజులపాటు దీక్షలో పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జూన్ 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజులపాటు దీక్ష ఆయన చేస్తారు. ఇందులో భాగంగా పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. కాగా, 2023 జూన్‌లో పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో వారాహి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో క్షేత్రస్థాయి రాజకీయ యాత్రల కోసం ప్రత్యేక వాహనం తయారుచేయించుకున్న పవన్ కళ్యాణ్ దానికి 'వారాహి' అని పేరుపెట్టారు. నాడు యాత్ర సందర్భంగా పవన్ వారాహి అమ్మ వారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. తాజాగా, సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో పవన్ మరోసారి వారాహి అమ్మవారి దీక్షను చేపడుతున్నారు.

పవన్‌తో సినీ నిర్మాతల భేటీ
సోమవారం టాలీవుడ్ సినీ నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అనంతరం సినీ నిర్మాతలు మీడియాతో మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను సినీ పరిశ్రమ తరఫున అభినందించడానికి అపాయింట్మెంట్ అడిగినట్టు, తమ విజ్ఞాపనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్టు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలియచేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించలేదనీ, త్వరలోనే మరోసారి కలిసి చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చిస్తామని ఆయన తెలిపారు. సోమవారం మధ్యాహ్నం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కందుల దుర్గేష్, నిర్మాతలు సి.అశ్వనీదత్, ఎ.ఎం.రత్నం, డి.సురేష్ బాబు, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , సుప్రియ, ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ, వై.రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications