ఇంత చేసినా.. మీకర్థం కాలేదంటే నేనేం చేయను?
ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తమతోనే ఉన్నారని భారతీయ జనతాపార్టీ నాయకులు ప్రకటిస్తున్నారు. విశాఖపట్నం నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న పవన్ ను పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిసి సంఘీభావం తెలియజేశారు. అన్ని విషయాలను కూలంకుషంగా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. ఇతర నేతలు కూడా పవన్ ను నేరుగా కలవకపోయినా పలుచోట్ల మీడియాతో మాట్లాడుతూ మద్దతు తెలియజేశారు. తమ రెండు పార్టీలు పొత్తులోనే ఉన్నాయని విస్పష్టంగా చెప్పారు.

తెలంగాణ నాయకత్వంతో విభేదాలు!
తెలంగాణలోని బీజేపీ నాయకత్వంతో పవన్ కు మొదటి నుంచి విభేదాలున్నాయి. వారంతా అనవసరమైన వ్యాఖ్యలతో పవన్ కల్యాణ్ ను విమర్శిస్తుండటంతో ఆ పార్టీకి దూరం జరగాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. అక్కడ ఏ కార్యక్రమమైనా ఒంటరిగానే చేస్తుంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అకస్మాత్తుగా టీఆర్ఎస్ తరఫున పోటీపడిన పి.వి.నరసింహారావు కుమార్తెకు మద్దతిచ్చారు. తాజాగా దాసోజు శ్రావణ్ బీజేపీకి రాజీనామా చేశారు. కొద్దిరోజుల క్రితమే కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చారు. కానీ ఆయన అందులో ఇమడలేక రాజీనామా చేశారు. దీనిపై పవన్ స్పందించారు. దాసోజు నిర్ణయాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు.

బీజేపీకి షాకిచ్చిన పవన్ ట్వీట్?
పవన్ చేసిన ట్వీట్ రెండు రాష్ట్రాల్లోని బీజేపీ నాయకులకు షాకిచ్చినట్లుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ట్వీట్ లో రాజకీయ కోణం ఏదీ లేదని, దాసోజు పవన్ కు స్నేహితుడు కావడంతో అభినందనలు తెలియజేశాడని జనసేన వర్గాలంటున్నాయి. అతను ప్రజారాజ్యం పార్టీలో పనిచేస్తున్నప్పటి నుంచి పవన్ తో సన్నిహితంగా మెలిగేవారు. దాసోజు శ్రావణ్ రాజకీయ భావాలంటే పవన్ కల్యాణ్ కు బాగా ఇష్టం. అలాంటి రాజకీయ నాయకుడికి పార్టీలు సరైన అవకాశాలు కల్పించడంలేదని, సామాజికవర్గం పేరుతో దూరంగా పెట్టొద్దని పలు సందర్భాల్లో పవన్ కోరేవాడు. ఇప్పుడు కూడా అదే కోణంలో ట్వీట్ పెట్టాడేకానీ బీజేపీ కోణం లేదని స్పష్టం చేస్తున్నాయి.

బీజేపీ నుంచి సహకారం అందడంలేదు!
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పాల్గొనకుండా బీజేపీ కోపం త్యాగం చేశామని, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పాల్గొనలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లోను బీజేపీకే మద్దతిచ్చారని, అన్నివిధాలుగా తమను తగ్గించుకుంటూ పలు సందర్భాల్లో ఎన్నో త్యాగాలు చేశామని, కానీ ఏపీ, తెలంగాణలో బీజేపీ నుంచి తమకు సరైన సహకారం అందడంలేదని జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి. భవిష్యత్తులో పవన్ కల్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారో దీనిద్వారా స్పష్టం చేశారంటున్నాయి. తాను ఏపీలో ఎలా ముందుకు వెళుతున్నారు? ఏవిధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారనేవి అందరికీ స్పష్టంగా అర్థమయ్యే రీతిలోనే చేస్తున్నారని, అయినా వాటిని నాయకులు అర్థం చేసుకోలేకపోతే తామేం చేయలేమని వ్యాఖ్యానిస్తున్నారు. ''ఇంత చేసినా మీకర్థం కాలేదంటే నేనేం చెయ్యను?'' అన్న రీతిలో పవన్ చర్యలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.












Click it and Unblock the Notifications