చివరి కోరిక తీరినా..: ప్రజాసేవకే తపించిన పేటా రాధారెడ్డి ఇకలేరు
ఆయన ప్రజా సేవ చేయాలన్న కోరికతో రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే తన శాయశక్తులా ఆ పని చేస్తూ ముందుకు కదిలారు. ఆయన సేవలను గుర్తించిన ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ ఉన్నత పదవిని కట్టబెట్టింది.
శ్రీకాళహస్తి: ఆయన ప్రజా సేవ చేయాలన్న కోరికతో రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే తన శాయశక్తులా ఆ పని చేస్తూ ముందుకు కదిలారు. ఆయన సేవలను గుర్తించిన ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ ఉన్నత పదవిని కట్టబెట్టింది. చిరకాల కోరిక తీరిందనుకుంటున్న తరుణంలో ఆయన తుది శ్వాస వీడవడం అందర్నీ కలిచి వేసింది. ఆయనే తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఛైర్మన్ పేటా రాధారెడ్డి.

మొదట్నుంచీ ప్రజాసేవే..
ఐదో తరగతి వరకే చదివిన ఆయన శ్రీకాళహస్తి పురపాలక సంఘం ఛైర్మన్ స్తాయికి ఎదగడం గమనార్హం. రాధారెడ్డి నేపథ్యాన్నిచూసినట్లయితే.. 1954 జులై 1వ తేదీన వెంకటేశ్వర్లురెడ్డి, గంగమ్మలకు జన్మించారు. చదువంతగా అబ్బకపోవడంతో ఏర్పేడులో సోడా దుకాణాన్ని నడుపుతూ సమయం చిక్కినప్పుడల్లా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.

ఎన్టీఆర్‌పై అభిమానంతో..
రాజకీయాల్లోకి రావడంతో ప్రజలకు మరింత సేవ చేయవచ్చునని భావించిన రాధారెడ్డి.. ఎన్టీఆర్ మీదున్న అభిమానంతో ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన రాధారెడ్డి.. జిల్లా పార్టీలో ఓ నేతగా ఎదిగారు.

అటుపోట్లు ఎదుర్కొన్నా..
రాజకీయాల్లో ఎన్నో ఆటు, పోట్లు ఎదుర్కొన్నారు. ఐదు దఫాలు శ్రీకాళహస్తి పురపాలక సంఘ కౌన్సిలర్‌గా ఎన్నికైన వ్యక్తిగా కూడా ఆయన తనకంటూ గుర్తింపును చాటుకున్నారు. పురపాలక సంఘ పరిపాలన విషయాల్లో ఎంతో అవగాహన కల్గడంతో పాటు.. చదువు లేకున్నా.. ప్రతి విషయాన్ని క్షుణ్నంగా తెలుసుకోవడం, వార్తాపత్రికలు చదువుతూ ఎప్పటికప్పుడు పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ వచ్చారు.

అఖండ విజయం..
కాగా, పురపాలక సంఘ ఛైర్మన్ కావాలన్నది ఆయన చిరకాల కోరిక. 2014 పురపాలక సంఘ ఎన్నికల్లో జనరల్‌కు రిజర్వు అయినా.. టీడీపీలో క్రమశిక్షణ కల్గిన నేతగా తనకంటూ ముద్ర వేసుకోవడం, చంద్రబాబుపై ఉన్న అపార అభిమానం, పార్టీ పట్ల నిబద్ధత కారణాలతో బీసీకి చెందిన ఈయన్ను అప్పటి నియోజకవర్గ ఇంఛార్జి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పురపాలక సంఘ ఛైర్మన్ అభ్యర్థిగా బరిలో దింపారు.
ప్రజలు, నేతల్లో ఉన్న అభిమానంతో అఖండ మెజార్టీతో విజయాన్ని సాధించారు రాధారెడ్డి.

సేవ చేయాలనే తపనతోనే...
ఆయన ఛైర్మన్ అయ్యాక.. పురపాలక సంఘ పరిధి పారిశుద్ధ్య విభాగంలో జరిగిన అవినీతికి సంబంధించి రూ.25 లక్షలను రికవరీ చేయడం గమనార్హం. తరచూ అంతర్గత కుమ్ములాటలతో.. పట్టణాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నామన్న బెంగతో అనారోగ్యానికి గురయ్యారు రాధారెడ్డి. ఈ క్రమంలోనే బుధవారం తుదిశ్వాస విడిచారు. రాధారెడ్డి మృతి చెందడంతో పట్టణంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పలువురు టీడీపీ నేతలతోపాటు ఇతర పార్టీల నేతలు కూడా తమ సంతాపాన్ని తెలియజేశారు. ఒక మంచి నేతను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications