మరికొన్ని గంటల్లో ప్రసవం.. నిండు గర్భిణి గొంతు నులిమి చంపిన భర్త
మరికొన్ని గంటల్లో ప్రసవం.. కానీ భర్త క్షణికావేశానికి ఆమె బలైంది. అంతేకాక కడుపులో ఉన్న నిండు శిశువు కుడా బయటకు రాకుండానే మృత్యుఒడిలోకి వెళ్లిపోయింది. మరికొన్ని గంటల్లో బాబునో పాపనో ఎత్తుకోబోతున్నామని అనుకున్న ఆ కుటుంబసభ్యులకు తీరని శోకం మిగిలింది. హృదయవిషాదకరమైన ఈ ఘటన విశాఖలోని మధురవాడలో జరిగింది.
వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. మూడేళ్లపాటు జీవితం సాఫీగా సాగిపోయింది. కానీ భర్త ప్రవర్తనలో మార్పు వల్ల ఆమె నిలదీసింది. దీంతో సహనం కోల్పోయిన భర్త.. భార్య నిండు గర్భిణి అని కూడా చూడకుండా అతి కిరాతకంగా గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటనతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విశాఖపట్నంలోని మధురవాడలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
ఏం జరిగింది..?
విశాఖలోని మధురవాడలోని స్థానిక ఆర్టీసీ కాలనీలోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో గెద్దాడ జ్ఞానేశ్వరరావు, అతడి భార్య అనూష నివాసం ఉంటున్నారు. మూడు సంవత్సరాల క్రితం ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహాన్ని పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ సెపరేట్ గా నివాసం ఉంటున్నారు. జ్ఞానేశ్వర్ కు నగరంలో రెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. అయితే అనూష ప్రస్తుతం గర్భవతి. ఆమెకు నెలలు నిండాయి. మరో 24 గంటల్లో డెలివరీ అవుతుందని వైద్యులు తెలిపారు. అయితే గత కొద్దీ రోజులుగా భర్త ప్రవర్తనపై అనూషకు అనుమానం కలిగింది. దీనిపై ఇరువురి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉండేది.

తాజాగా మరోసారి భార్యాభర్తల మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో జ్ఞానేశ్వర్ క్షణికావేశంతో అనూష గొంతును గట్టిగా నొక్కేశాడు. ఆమె ఊపిరి అందక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఏమీ ఎరగనట్టు జ్ఞానేశ్వర్ స్థానికుల సాయంతో అనూషను ముందుగా ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి కేజీహెచ్ కు తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు జ్ఞానేశ్వర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో తానే చంపినట్లు జ్ఞానేశ్వర్ అంగీకరించాడని ఏసీపీ అప్పలరాజు వివరించారు.












Click it and Unblock the Notifications