ఎక్కడికో ఎందుకు... గన్నవరం వస్తే ఇక్కడే చూసుకుందాం!!
ప్రతి సెకనుకు, ప్రతి నిముషానికి గన్నవరంలో ఏం గొడవ జరుగుతుందో? ఏమవుతుందో? అనే ఆందోళనలో అక్కడి ప్రజలున్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం ఎప్పుడూ ప్రశాంతతకు మారుపేరు. ఎన్నికల సమయంలో కూడా అక్కడ ఎటువంటి వివాదాలు చోటుచేసుకునేవి కావు. కానీ ఇప్పుడు ప్రతి సెకనుకు, ప్రతి నిముషానికి ఏం గొడవ జరుగుతుందో? ఏమవుతుందో? అనే ఆందోళనలో అక్కడి ప్రజలున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించి వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్న వల్లభనేని వంశీ తీరుతోనే గన్నవరం నియోజకవర్గం ఉద్రిక్తతలకు ఆలవాలంగా మారిందని ప్రజలు మండిపడుతున్నారు.

పోలీసుల తీరు ఎంతవరకు సబబు?
నిన్న జరిగిన ఘటనలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతోపాటు కార్యాలయ ఫర్నిచర్, కార్యాలయం బయట ఉన్న కారును వంశీ అనుచరులు దగ్ధం చేశారు. అయితే గొడవ జరుగుతున్నప్పుడు వారిని నిలవరించకుండా గొడవ అయిపోయిన తర్వాత వారిని దగ్గరుండి పోలీసులు బతిమాలి పంపించడం ఎంతవరకు సబబని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

పట్టాభి దూకుడుకు కళ్లెం వేయాలని..
వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీచేద్దామనుకుంటున్న టీడీపీ నాయకుడు పట్టాభి గన్నవరంలో తానే పోటీచేసి వంశీకి డిపాజిట్లు రాకుండా చేసి తరిమికొడతామని హెచ్చరించారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో వంశీ పై ఓటమి చెందిన నాయకులతోపాటు వైసీపీలో ఉన్న నాయకులు కూడా వంశీకి ఇప్పటికీ ప్రత్యర్థులుగానే కొనసాగుతున్నారు. పట్టాభి దూకుడుకు కళ్లెం వేయడంతోపాటు వైసీపీలోనే ఉన్న తన ప్రత్యర్థులకు ఒక హెచ్చరిక పంపించినట్లవుతుందనే ఉద్దేశంతో వంశీ ఈ దాడులకు సపోర్ట్ చేశారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

కారులో కార్యాలయం చుట్టూ చక్కర్లు?
టీడీపీ తరఫున విజయం సాధించి వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్న వంశీకి నియోజకవర్గ పరిధిలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని, వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేలా వంశీ వ్యవహరించారని ఆరోపిస్తున్నాయి. టీడీపీ కార్యాలయంపై గొడవ జరగడానికి ముందు ఉదయం సమయంలో కార్యాలయం చుట్టూ వంశీ కారులో చక్కర్లు కొట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

సవాల్ విసిరిన వంశీ
తనపై వస్తున్న ఆరోపణలపై వంశీ హనుమాన్ జంక్షన్ లో మీడియాతో మాట్లాడారు. దాడులు ఇంతటితో ఆగుతాయా? అని విలేకరులు ప్రశ్నించగా వాటిని తాను మొదలు పెట్టలేదని, ఎవరో రెచ్చగొడితేనే తన అనుచరులు ఈ దాడికి దిగారంటూ వంశీ స్పష్టత ఇచ్చారు. నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలే ఉన్నాయని, సమస్యల్లా బయట నుంచి వచ్చిన నాయకులతోనే అని వంశీ స్పష్టత ఇచ్చారు. ఒకప్పుడు తన కారుపై వేలాడినవారు.. కాల్ మనీ కేసులో నిందితులైనవారు తనను అక్కడికిరా.. ఇక్కడికి రా.. అంటూ తేల్చుకుందామంటూ మీడియాలో ఊదరగొడుతున్నారని, తాను ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని, ఎవరైనా గన్నవరం వస్తే చూసుకుందామంటూ సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications