తుని ఘటన ప్లాన్ ప్రకారమే జరిగిందా?: ఆమరణ దీక్ష యోచనలో ముద్రగడ
విజయవాడ: తునిలో ఆదివారం జరిగిన 'కాపు గర్జన' హింసాత్మకంగా మారింది. సమావేశాలు అవసరం లేదని, డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కుదామని, పదండి.. అంటూ కాపు నేత ముద్రగడ పద్మనాభం పిలుపునివ్వగా కాపులు వెంటనే స్పందించారు.
జాతీయ రహదారిపైనే కాక సమీపంలోని రైల్వే ట్రాక్ పైకి దూసుకువచ్చిన కొందరు ఆందోళనకారులు అటుగా వెళుతున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పు పెట్టారు. తమను నిలువరించేందుకు యత్నించిన పోలీసుల పైనా దాడికి దిగారు. అంతటితో ఆగలేదు.
ముందుగానే పథకం వేసుకున్నట్లుగా... గాయపడి అంబులెన్స్‌లో చికిత్స పొందుతున్న పోలీసుల పైనా విరుచుకు పడ్డారు. ఓ ఎస్సైతో పాటు మరో కానిస్టేబుల్ చికిత్స తీసుకుంటున్న అంబులెన్స్‌ను చుట్టుముట్టిన వందలాది మంది ఆందోళనకారులు దానిపై విచక్షణారహితంగా దాడికి దిగారు.
వ్యాన్ లోపలికి చొచ్చుకెళ్లి పోలీసులపై దాడి చేశారు. అప్పటికే ఆందోళనకారుల దాడిలో గాయపడ్డ ఎస్పై ప్రాణాలు అరచేత పెట్టుకొని వెళ్లిపోయారు. గాయాలతోనే ఆయన పరుగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఇక గాయాలతో కదలలేని స్థితిలో ఉన్న కానిస్టేబుల్ పైన ఆందోళనకారులు ప్రతాపం చూపడంతో పాటు బెదిరించారట.

ఆమరణ దీక్ష సన్నాహాల్లో ముద్రగడ
కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఆయన పలువురు కాపు నేతలతో ఈ విషయమై చర్చిస్తున్నారు. కాపు సంఘం నేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నారు. పలువురు కాపు నేతలు కిర్లంపూడి చేరుకుంటున్నారు.
విజయవాడకు నిలిచిన విమాన సర్వీసులు
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు అలుముకోవడంతో శంషాబాద్ నుంచి విజయవాడ వెళ్లాల్సిన విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. సోమవారం ఉదయం ఉదయం బయలుదేరాల్సిన విమానం పదకొండు గంటలు దాటినా శంషాబాద్ విమానాశ్రయంలోనే నిలిచిపోయింది.
దీంతో విజయవాడ వెళ్లాల్సిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు, పలువురు ఎమ్మెల్సీలు శంషాబాద్ విమానాశ్రయంలో వేచి చూస్తున్నారు. తుని ఘటన నేపథ్యంలో మంత్రులు బెజవాడకు వెళ్తున్నారు.












Click it and Unblock the Notifications