పులివెందుల ఎన్నికలపై మరో ట్విస్ట్..! కలెక్టర్ కు షాక్..!
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ నియోజకవర్గం పులివెందుల పరిధిలో జరిగిన జడ్పీటీసీ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ, వైసీపీ హోరాహోరీకి ప్రయత్నించాయి. ఇందులో భాగంగా టీడీపీ అక్రమాలకు పాల్పడిందని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ఫలితం మాత్రం ఏకపక్షంగా టీడీపీకి మద్దతుగానే వచ్చింది. దీంతో వైసీపీ ఆరోపణలకు విలువలేకుండా పోయిందన్న చర్చ నేపథ్యంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో జరిగిన అక్రమాలపై కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కు జాతీయ ఎస్సీ కమిషన్ ఇవాళ నోటీసు జారీ చేసింది. ఎస్సీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకున్నారని, పోలింగ్ బూత్‌లను గూండాలు ఆక్రమించారని, నిజమైన ఓటర్ల పేర్లతో వారి అనుమతి లేకుండా ఓట్లు వేసినట్లు కమిషన్‌కు ఫిర్యాదు అందింది. ఇలాంటి ఘటనలు ప్రాథమిక హక్కులను తిరస్కరించడం, షెడ్యూల్డ్ కుల ఓటర్లపై దౌర్జన్యాలకు సమానమని ఎస్సీ కమిషన్ పేర్కొంది.

దీనిని పరిగణనలోకి తీసుకుని ఎస్సీ కమిషన్.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 కింద తన అధికారాలను వాడి విచారణ ప్రారంభించింది. ఆగస్టు 26న ఇచ్చిన నోటీసులో 15 రోజుల్లోగా దీనిపై కలెక్టర్ వివరణాత్మక చర్య తీసుకున్న నివేదికను సమర్పించాలని ఆదేశించింది. బూత్ ల అక్రమణ, ఓటింగ్ హక్కులను తిరస్కరించడం , ఓట్ల దుర్వినియోగం వంటి ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో పేర్కొనాలని సూచించింది.

గడువులోపు స్పందించడంలో విఫలమైతే, సివిల్ కోర్టు అధికారాలను వినియోగించుకోవాల్సి వస్తుందని , కలెక్టర్‌ను వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా హాజరు కావాలని సమన్లు జారీ చేయాల్సి వస్తుందని ఎస్సీ కమిషన్ హెచ్చరించింది.ఓటు హక్కు రాజ్యాంగబద్ధమైన రక్షణ అని గుర్తుచేసింది. షెడ్యూల్డ్ కుల వర్గాల ప్రజాస్వామ్య హక్కులను కాపాడటానికి ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తామని కమిషన్ హామీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications