అది విని నా మనస్సు అల్లకల్లోలమైంది: అయినోళ్లకు ఆకుల్లో..కానోళ్లకు కంచాల్లో: రఘురామ లేఖ
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడిగా ముద్రపడిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాజాగా మరో లేఖ రాశారు. నవ సూచనలు (వినమ్రతతో) అనే సిరీస్‌లో ఈ లేఖ ఏడవది. ఈ రెండో లేఖను కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గిస్తుందంటూ వార్తలు రావడం, గ్రామ సర్పంచుల అధికారాలను వీఆర్వో లకు బదిలీ చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందించారు. ముఖ్యమంత్రికి కొన్ని సూచనలు చేస్తున్నానంటూ పేర్కొన్నారు.

ఆందోళనకు గురి చేసిన పదవీ విరమణ వయస్సు వార్తలు.
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 57 సంవత్సరాలకు తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోందంటూ వచ్చిన వార్తలు, కథనాలు తనను తీవ్ర ఆందోళనకు గురి చేశాయని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఆ వార్తలు విన్న తరువాత తన మనసు అల్లకల్లోలమైందని, అవి పుకార్లు మాత్రమే అని తెలిసిన తరువాతే తాను కొంత ఊపిరి పీల్చుకున్నానని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించే ప్రతిపాదనలు నిజంగా ఉంటే.. వాటిని ఉపసంహరంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో 61 సంవత్సరాలు..
తోటి తెలుగు రాష్ట్రం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచిందని గుర్తు చేశారు. 35 సంవత్సరాల పాటు దాన్ని సవరించకుండా ఉన్న నిబంధనలో అక్కడి ప్రభుత్వం ఏడేళ్లలోనే మార్పులు చేసిందని అన్నారు. ప్రస్తుతానికి తెలంగాణే దేశంలో కెల్లా అతి ఎక్కువ పదవీ విరమణ వయస్సున్న రాష్ట్రంగా గుర్తింపు పొందిందని అన్నారు. అన్ని రాష్ట్రాలు కూడా పదవీ విరమణ వయస్సు 58 లేదా 60 సంవత్సరాలుగా ఉందని గుర్తు చేశారు. దాన్ని మరింత తగ్గించి 57గా నిర్ధారించాలనుకోవం అత్యంత దారుణమని, తీవ్ర నిరాశను కలిగించే విషయమని చెప్పారు.

వీఆర్వోలకు సర్పంచ్‌ల బాధ్యత సరికాదు..
గ్రామ సర్పంచ్‌లకు చెందిన కొన్ని బాధ్యతలను వారి నుంచి తొలగించి- వీఆర్వోలకు కట్టబెట్టాలనుకోవడం కూడా సరికాదని రఘురామ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన జీవో నంబర్ 2ను హైకోర్టు కొట్టి వేసిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల వార్షిక పనితీరు నివేదికను తయారు చేసే బాధ్యత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద ఉంటుందని, ప్రజా ప్రతినిధిగా ఉన్న ముఖ్యమంత్రి దాన్ని లాక్కోవడం సరికాదని చెప్పారు. ఇలాంటి అసంబద్ధ నిర్ణయాలను తీసుకోవడాన్ని ఎవరూ సమర్థించబోరని అన్నారు. అయినోళ్లకు ఆకుల్లో..కానోళ్లకు కంచాల్లో.. అనే సామెతను గుర్తుకు తెస్తోందని అన్నారు.
Recommended Video

జీతాలే ఇవ్వలేకపోతున్నాం..
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు, పెన్సన్లను ఇవ్వలేకపోతోందని, అలాంటి దారుణమైన ఆర్థిక పరిస్థితులో ఉన్న సమయంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించడం వల్ల వారికి చెల్లించాల్సిన రిటైర్‌మెంట్ బెనిఫిట్లను ఎలా ఇవ్వగలుగుతామని ప్రశ్నించారు. బడ్జెట్‌లో ఎలాంటి ఆర్థిక వెసలుబాటు కల్పించకుండా అర్ధాంతరంగా తీసుకునే ఈ నిర్ణయంతో భారం పడుతుందని, దాన్ని ప్రభుత్వం ఎలా పూడ్చుకోగలుగుతుందని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడం, కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయడం వంటి కార్యాచరణపై దృష్టిని కేంద్రీకరించాలని రఘురామ ముఖ్యమంత్రికి సూచించారు.












Click it and Unblock the Notifications