అమరావతి శంకుస్థాపనకు గైర్జాజరు: వైయస్ జగన్ వ్యూహం ఏమిటి?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు రానని, తనను ఆహ్వానించవద్దని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడంలోని ఆంతర్యమేమిటనే చర్చ సాగుతోంది. జగన్ రాజకీయ వ్యూహం ఏమిటనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఆహ్వాన పత్రం అందించడానికి వచ్చిన మంత్రులు కామినేని శ్రీనివాస్, అయన్నపాత్రుడులను కలవడానికి కూడా ఆయన నిరాకరించారు.
మంత్రులను కలుసుకుని తన అభిప్రాయాన్ని చెప్పి ఉంటే బాగుండేదనే మాట కూడా వినిపిస్తోంది. ఈ విషయంలో జగన్ దూకుడు అపరిపక్వతతో కూడిందా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. అమరావతి శంకుస్థాపనకు రానని చెప్పడం ద్వారా ఆయన సాధించదలుచుకుంది ఏమిటనేది కూడా ఎవరికీ అర్థం కావడం లేదు.
ప్రభుత్వంతో ఎన్ని విభేదాలున్నా కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రతిపక్ష నేత వెళ్లడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీని జగన్ ఉల్లంఘిస్తున్నారనేది ఆంధ్రప్రదేశ్ మంత్రులూ టిడిపి నాయకుల మాటల్లో వ్యక్తమవుతోంది. అందుకే, తెలంగాణ ప్రతిపక్ష నేత కె. జానా రెడ్డిని చూసి జగన్ నేర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రులు అన్నారు.

తాను శంకుస్థాపనకు వెళ్లడం వల్ల రాజధానికి జరిపిన భూసేకరణను ఆమోదించినట్లు అవుతుందనే ఉద్దేశంతోనే ఆయన భావిస్తున్నారనే మాట వినిపిస్తోంది. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తామని కూడా ఆయన వాగ్దానం చేశారు. ఇలాంటి స్థితిలో శంకుస్థాపనకు వెళ్తే ప్రభుత్వ భూసేకరణ తీరును ఆమోదించినట్లవుతుందనే ఉద్దేశంతోనే వెళ్లకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
కాగా, ప్రత్యేక హోదాపై పోరాటాన్ని ఉధృతం చేసే దిశగా కూడా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రత్యేక హోదాను జగన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంజీవినిగా చెబుతున్నారు. అయితే, చంద్రబాబు మాత్రం అదే సంజీవిని కాదని అంటున్నారు. ప్రత్యేక హోదా లేకుండా ఏం చేసినా ఫలితం దక్కదనే తన అభిప్రాయాన్ని చెప్పడం కూడా ఆయన నిర్ణయంలో ఇమిడి ఉందని అంటున్నారు.
కాగా, ఈ నెల 22వ తేదీన గన్నవరంలో లేదా తిరుపతిలో కులుసుకునే అవకాశం కల్పించాలని జగన్ నరేంద్ర మోడీని కోరారు. ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరడానికి ఆయన ప్రధాని అపాయింట్‌మెంట్ కోరారు. ఆ రకంగా చంద్రబాబు ప్రభుత్వం మీద పైచేయి సాధించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఏమైనా, జగన్ నిర్ణయంపై మిశ్రమ స్పందనే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications