క్షమాపణపై మెలిక: రోజాకు మరో ఏడాది షాక్! అలా చేస్తే ఓకే
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాకు షాక్ తగలనుంది. మరో ఏడాది పాటు ఆమె పైన సస్పెన్షన్ కొనసాగించాలని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాకు షాక్ తగలనుంది. మరో ఏడాది పాటు ఆమె పైన సస్పెన్షన్ కొనసాగించాలని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
మరికొందరు ఎమ్మెల్యేల పైన వేటుకు రంగం సిద్ధమవుతోందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సీఎం పట్ల, ఎమ్మెల్యే అనిత పట్ల అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత ఏడాది రోజా పైన సస్పెన్షన్ విధించారు.
రోజా క్షమాపణల పైన కమిటీ సంతృప్తి చెందలేదని, కాబట్టి మరో ఏడాది పాటు సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధమవుతోందని ఓ వర్గం మీడియాకు లీకులు అందాయని సాక్షి పేర్కొంది.

భేషరతు క్షమాపణ చెప్పలేదని..
రోజా వివరణ పైన సంతృప్తి చెందని ప్రివిలేజెస్ కమిటీ ఆమె పైన సస్పెన్షన్‌ను మరో ఏడాది పాటు పొడిగించాలని సిఫార్సు చేసిందని తెలుస్తోంది. రోజా భేషరతు క్షమాపణ చెప్పలేదని, తోటి సభ్యురాలిపై దూషణకు చర్యలు తీసుకోవాల్సిందేనని కమిటీ నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే, శాసన సభది తుది నిర్ణయం.

అప్పటి దాకా హాజరు కావొచ్చు
రోజా పైన వేసిన ఏడాది సస్పెన్షన్ గడువు ముగిసింది. కాబట్టి అసెంబ్లీ నిర్ణయం వచ్చే దాకా ఆమె శాసన సభు రావొచ్చు. సీఎంను, టిడిపి ఎమ్మెల్యే అనితను అసెంబ్లీలోనే దుర్భాషలాడడంతో రోజా పైన సస్పెన్షన్ వేటు వేశారు.

గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన
గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన శాసన సభా హక్కుల కమిటీ శనివారం వెలగపూడిలోని నూతన అసెంబ్లీ ప్రాంగణంలో సమావేశమైంది. రోజాపై అనిత ఫిర్యాదుకు సంబంధించిన అంశాలను లోతుగా సమీక్షించారు. ఏడాది క్రితం శాసనసభ సమావేశంలో రోజాకు సంబంధించి రెండు వేర్వేరు సంఘటనలు జరిగాయి.

చంద్రబాబు, అనితలపై..
ముఖ్యమంత్రిని కామ చంద్రబాబు అని ఆమె దూషించారని, మిగిలిన సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుపై రోజాను అప్పట్లో ఏడాదిపాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ గడువు ముగిసింది. అవే సమావేశాల్లో రోజా అందరి ముందూ తనను అసభ్యంగా దూషించారని ఎమ్మెల్యే అనిత స్పీకర్‌కు మరో ఫిర్యాదు చేశారు.

రోజా క్షమాపణపై ట్విస్ట్
ఆ ఫిర్యాదును స్పీకర్ సభ ముందు పెట్టారు. ఈ అంశాన్ని సభాహక్కుల కమిటీకి అసెంబ్లీ అప్పగించింది. రోజాను ఈ కమిటీ తమ ముందుకు పిలిపించి విచారణ జరిపింది. ఆ రోజు జరిగిన విచారణలో నమోదైన అంశాలను శనివారం నాటి భేటీలో మరోసారి పరిశీలించారు. ఆ విచారణలో రోజా బేషరతుగా క్షమాపణ చెప్పినట్లుగా లేదని కమిటీ అభిప్రాయపడింది. అనిత బాధపడి ఉంటేనే లేదా కమిటీ అభిప్రాయపడితేనో తాను తన వ్యాఖ్యలను ఉపసంహరించుకునే విషయం పరిశీలిస్తానన్నట్లుగా ఆమె ఆ రోజు చెప్పినట్లు నమోదైంది.

పెద్దిరెడ్డి అడిగినా..
కమిటీలో వైసీపీ తరపున సభ్యుడిగా ఉన్న సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా బేషరతుగా క్షమాపణ చెబుతారా అని అడిగినప్పుడూ.. రోజా సూటిగా సమాధానమివ్వకుండా దాటవేసినట్లుగా మాట్లాడారని కమిటీ గుర్తించింది. ఆమె జవాబు సంతృప్తికరంగా లేనందున తోటి మహిళా సభ్యురాలిని అసభ్యంగా దూషించినందుకు ఆమెను ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని కమిటీ సిఫారసు చేసింది.

సభకు ముందుకు వస్తే రోజా క్షమాపణ చెబితే ఓకే
నివేదికను స్పీకర్ కోడెల శివప్రసాద రావుకు ఇస్తారు. ఆయన ఈ నివేదికను మంగళవారం (7న) సభ ముందుంచే అవకాశముంది. ఆరో తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నా ఆ రోజు గవర్నర్ ప్రసంగం తప్ప ఇతర కార్యక్రమాలు ఉండవు. ఏడో తేదీన మాత్రమే సభ సాధారణ కార్యక్రమాలు చేపడుతుంది. ఈ అంశం సభ ముందు చర్చకు వచ్చినప్పుడు రోజా తన వ్యాఖ్యలకు బేషరతు క్షమాపణ చెబితే చర్య ఉండకపోవచ్చని అంటున్నారు. అందుకు ఆమె సంసిద్ధత తెలపకపోతే సస్పెన్షన్ వేటు పడే అవకాశముందని అంటున్నారు. దీనిపై తుది నిర్ణయం జరిగేవరకూ రోజా సభకు హాజరు కావచ్చంటున్నారు.












Click it and Unblock the Notifications