తిరుపతిలో అర్ధ బ్రహ్మోత్సవం.. చూసి తీరాల్సిన వేడుకలు
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు 76,447 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 21,708 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.42 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో నాలుగు కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టింది.
ఈ నెల 25వ తేదీన రథ సప్తమి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కన్నుల పండువగా ప్రత్యేక వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా స్వామివారు దేవేరులతో కలిసి ఏడు వాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. తెల్లవారు జామున 3 నుండి 5 గంటల వరకు శ్రీచక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహిస్తారు.

అనంతరం 5:30 నుండి 7:30 గంటల వరకు సూర్యప్రభ వాహనంతో శ్రీగోవిందరాజస్వామి వారి వాహన సేవలు ప్రారంభమవుతాయి. ఉదయం 8 నుండి 9 గంటల వరకు హంస వాహనం, 9.30 నుండి 10.30 వరకు హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు. 11.30 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పెద్దశేష వాహనం, మధ్యాహ్నం 1.30 నుండి 3 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు.
మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. రాత్రి 8 నుండి రాత్రి 9.30 గంటల వరకు గరుడ వాహనాన్ని అధిష్టించి దర్శనం ఇస్తారు. రథసప్తమి వేడుకలను అర్ధ బ్రహ్మోత్సవం, ఒక రోజు బ్రహ్మోత్సవంగా భక్తులు భావిస్తారు. బ్రహ్మోత్సవ రోజుల్లో నిర్వహించే వాహన సేవలన్నీ కూడా ఒకే రోజు భక్తుల కళ్ల ముందు సాక్షాత్కరిస్తోండటమే దీనికి కారణం.












Click it and Unblock the Notifications