ఏపీలో మంత్రుల శాఖల మార్పు..!! సీనియర్ల అభ్యర్ధన : సీఎం జగన్ ఆలోచన ఇదే..!!
ఏపీలో కొత్త మంత్రులు కొలువు తీరారు. కొందరు ఇప్పటికే తమకు కేటాయించిన శాఖల బాధ్యతలు స్వీకరిస్తున్నారు. కొందరు మాత్రం ప్రమాణ స్వీకారం చేసి వారం పూర్తయినా..ఇంకా బాధ్యతల స్వీకరణకు ముందుకు రాలేదు. పాత మంత్రుల్లో 11 మందిని..కొత్తగా 14 మందికి సీఎం తన కేబినెట్ లో అవకాశం కల్పించారు. సీనియర్లుగా తీసుకున్న వారిలో బొత్సా..పెద్దిరెడ్డి.. ఆదిమూలపు సురేష్..విశ్వరూప్.. తానేటి వనిత శాఖలను మార్చారు. కన్నబాబు పర్యవేక్షించిన వ్యవసాయ శాఖను నెల్లూరు జిల్లాకు చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డికి కేటాయించారు. అదే విధంగా ఎస్టీ వర్గం నుంచి మంత్రి అయిన రాజన్నదొరకు గిరిజన సంక్షేమం కేటాయించినా..ఆయన ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. ఆయన ఆ శాఖనే నిర్వహించాల్సి ఉంటుంది.

శాఖల మార్పు పైన చర్చ
అయితే, తొలి కేబినెట్ లో పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా పని చేసిన పెద్దిరెడ్డికి గతంలో బాలినేని నిర్వహించిన శాఖలను కేటాయించారు. పెద్దిరెడ్డి బాధ్యతలను కొత్తగా కేబినెట్ లో చేరిన అనకాపల్లి జిల్లాకు చెందిన బీసీ నేత బూడి ముత్యాలనాయుడుకు డిప్యూటీ సీఎం హోదాలో కట్టబెట్టారు. బొత్సాకు గతంలో నిర్వహించిన మున్సిపల్ శాఖను ఆదిమూలపు సురేష్ కు కేటాయించి... సురేష్ నిర్వహించిన విద్యా శాఖను బొత్సాకు ఖరారు చేసారు. అదే విధంగా సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పని చేసిన విశ్వరూప్ కు రవాణా శాఖ ఇచ్చారు. తానేటి వనితకు మహిళా శిశు సంక్షేమం నుంచి మార్చి హోం శాఖ అప్పగించారు. ఇక, ఇప్పుడు సీనియర్లలో బుగ్గన..జయరాం..అప్పలరాజు..నారాయణ స్వామి...లాంటి వారికి గతంలో నిర్వహించిన శాఖలనే కొనసాగించారు.

మున్సిపల్ బొత్సా కోరుతున్నారంటూ..
ఇప్పుడు సీనియర్ నేత బొత్సా సైతం తనకు తిరిగి మున్సిపల్ శాఖ ఇవ్వాలని కోరుతున్నట్లుగా ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అదే విధంగా సురేష్ సైతం విద్యా శాఖ లో నాడు - నేడు, విద్యా రంగంలో కొత్త బోధన- సంస్కరణల పైన పూర్తి అవగాహన పెంచుకొనే సమయంలో శాఖ మార్పు జరిగిందనే భావనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. విద్యా శాఖ కీలకమైనది కావటంతో దీని పైన పూర్తిగా అవగాహన పెంచుకొనే సరికి సమయం పడుతుందనే భావన బొత్సా మద్దతు దారులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో బొత్సా విద్యా శాఖ పర్యవేక్షించలేదు. కొందరు సీనియర్లకు గతంలో నిర్వహించిన శాఖలు కేటాయించన విధంగానే తనకూ మున్సిపల్ ఇవ్వాలని బొత్సా కోరుకుంటున్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం కొనసాగుతోంది. కొత్త శాఖలు అయితే, ఇటు పట్టు సాధించటం అదే సమయంలో రాజకీయంగా ఇచ్చిన బాధ్యతల నిర్వహణ పైన ఫోకస్ పెట్టటం కొంత ఇబ్బంది కర పరిస్థితులుగా చెబుతున్నట్లు తెలుస్తోంది.

సీఎం నిర్ణయంలో మార్పు లేదని క్లారిటీ..
ఆర్దిక మంత్రి బుగ్గన తిరిగి తాను అదే శాఖలో కొనసాగుతున్నందున ప్రత్యేకంగా ఛార్జ్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే, సీఎం మాత్రం అన్ని ఆలోచన చేసిన తరువాతనే విద్యా శాఖను బొత్సాకు కేటాయించారని ముఖ్య నేతలు చెబుతున్నారు. నాడు - నేడు పథకం ప్రతిష్ఠాత్మకం కావటంతో పాటుగా..విద్యా - వైద్యం రెండూ ప్రభుత్వ పాలన పైన ప్రతక్ష్యంగా ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానిస్తున్నారు. దీని కారణంగానే విద్యా శాఖకు సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యత కారణంగానే బొత్సాకు ఈ శాఖ ఖరారు చేసారని చెబుతున్నారు. దీని ద్వారా..సీనియర్లు కోరుకున్నా..మరింత కాలం నిరీక్షించినా కేటాయించిన శాఖలను మార్చేందుకు సీఎం సిద్దంగా లేరనేది విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు ఈ వ్యవహారం ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications