చిరంజీవి లాగే చంద్రబాబు పదవి కోసం: షర్మిల ఫైర్

శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సోదరి షర్మిల తీవ్రంగా ధ్వజమెత్తారు. తన సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా ఆమె సోమవారం సాయంత్రం శ్రీకాకుళం బహిరంగ సభలో ప్రసంగించారు. చిరంజీవి మాదిరిగానే చంద్రబాబు కాంగ్రెసుతో కలిసిపోయి కేంద్ర మంత్రి పదవినో, ముఖ్యమంత్రి పదవినో పొందాలని అనుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు. విభజనకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చారని ఆమె విమర్శించారు. ఆ లేఖను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు నీటి కష్టాలు తప్పవని, పోలవరం ప్రాజెక్టును నింపడానికి ఎక్కడి నుంచి నీరు తెస్తారని ఆమె అన్నారు. ఓట్లు, సీట్ల కోసం తెలుగు జాతిని చీలుస్తారా, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి రాష్ట్రాన్ని విభజిస్తారా అని ఆమె అడిగారు. విభజన గురించి ముందే తెలిసినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యతిరేకించలేదని ఆమె అన్నారు. చంద్రబాబు తీరు దున్నపోతుపై వర్షం పడినట్లే ఉందని వ్యాఖ్యానించారు.

Sharmila

తమ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందని భయపడి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుట్ర చేసి వైయస్ జగన్‌ను జైలు పాలు చేశాయని ఆమె విమర్శించారు. కోట్ల మందికి అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు గుడ్లప్పగించి చూస్తున్నారని షర్మిల వ్యాఖ్యానించారు. ఐఎంజి, ఎమ్మార్, ఇతర వ్యవహారాల్లో తనపై వచ్చిన ఆరోపణల మీద సిబిఐ విచారణ జరిపించాలని చంద్రబాబు తన ఢిల్లీ యాత్రలో రాష్ట్రపతిని, ప్రధానిని కోరాలని ఆమె డిమాండ్ చేశారు. ఆ ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ఆమె అడిగారు. చంద్రబాబు విచారణల నుంచి తప్పించుకోవడానికి కేంద్ర మంత్రి చిదంబరాన్ని, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను కలిశారని, కలుస్తూనే ఉన్నారని ఆమె అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డిపై నిందలు వేసి లక్ష కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడని నిందలు వేసి కాంగ్రెసుతో కలిసి చంద్రబాబు జగన్‌పై కేసులు పెట్టించారని ఆమె అన్నారు. జగన్‌కు బెయిల్ రాకుండా కాంగ్రెసుతో కుమ్మక్కయి కుట్రలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. సీమాంధ్రకు అన్యాయం చేయడానికి కాంగ్రెసు చేసిన విభజనకు మద్దతు పలికారని అన్నారు. దమ్ముంటే విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపించేసరికి మరోసారి బిజెపితో పొత్తుకు చంద్రబాబు సిద్ధపడుతున్నారని షర్మిల అన్నారు.

చంద్రబాబు చేసిందంతా చేసి రాష్ట్ర విభజనకు వైయస్ రాజశేఖర రెడ్డి కారణమని అంటున్నారని, కళ్లార్పకుండా చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా చెప్పగలరని ఆమె అన్నారు. విభజనకు అనుకూలంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎప్పుడూ లేఖ ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేశారని, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం పదవి మత్తులో మునిగితేలుతున్నారని ఆమె అన్నారు. వారు రాజీనామా చేసి ఉంటే విభజన ఆగిపోయి ఉండేదని ఆమె అన్నారు.

న్యాయం చేయడం కాంగ్రెసుకు చేత కాదని, అందువల్ల రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆమె అన్నారు. న్యాయం చేయలేనప్పుడు విభజన చేసే హక్కు కాంగ్రెసుకు లేదని ఆమె అన్నారు. జైల్లో ఉన్నా బయట ఉన్నా జగన్ జనం నేత అని, బయట ఉన్నా తెలుగుదేశం, కాంగ్రెసు నాయకులు దొంగలూ ద్రోహులేనని ఆమె అన్నారు. బోనులో ఉన్నా సింహం సింహమేనని ఆమె అన్నారు. జగన్ బయటకు వచ్చి రాజన్న రాజ్యం స్థాపిస్తాడని, ఆ రోజు వరకు జగనన్నను ఆశీర్వదించాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+