అపాయింటెడ్ డేట్: 'డబుల్' హ్యాపీ కోసం కెసిఆర్, తెరాస
హైదరాబాద్: విభజన తేదీని ముందుకు జరపాలని తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తోంది. ఈ నెల 12వ తేదీతో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగియనున్నాయి. పదహారవ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఎన్నికల ఫలితాల పైన తెరాస, ఆ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ధీమాతో ఉన్నారు.
తెలంగాణలో తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అపాయింటెండ్ తేదీని కూడా ముందుకు జరపాలని వారు కేంద్రాన్ని కోరుతున్నారు.

కేంద్రం అపాయింటెడ్ తేదీని జూన్ 2న ఇచ్చింది. అయితే, మే 16న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో.. అవి తమకు పూర్తిగా అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నందున.. అదే సంతోష సమయంలో అపాయింటెడ్ తేదీ ఉంటే బాగుండుందని తెరాస వర్గాలు భావిస్తున్నాయి. అందుకే అపాయింటెడ్ తేదీను ముందుకు జరపాలని కేంద్రాన్ని కోరుతున్నాయి.
మే 16వ తేదీన ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో... మిగతా రాష్ట్రాలు, కేంద్రంలో వలే.. విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోను వెంటనే ప్రభుత్వాలు ఏర్పడితే బాగుంటుందని, జూన్ 2వ తేదీ అంటే పదిహేను రోజులు ఆగాల్సి వస్తుందని, అది సరికాదని, దీనిని కేంద్రం ఆలోచించాలని తెరాస నేత జగదీశ్వర్ రెడ్డి చెబుతున్నారు. ఈ విషయమై ఆయన హైకోర్టుకు కూడా వెళ్లారు.
ఫలితాలకు, అపాయింటెండ్ తేదీకి మధ్య పదిహేను రోజుల తేడా ఉండటంతో తెరాస వర్గాలు కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. తమ పార్టీకి ఒకటి రెండు సీట్లు తక్కువ పడితే... అధికారంలోకి వచ్చే పార్టీ తమ పైన పావులు కదిపే ప్రమాదం లేకపోలేదని అనుమానిస్తున్నారు. అయితే తమకు పూర్తి మెజార్టీ వస్తుందని మాత్రం తెరాస వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఇప్పుడు ఈ తేదీని మార్చడం కుదరకపోవచ్చునని మరికొందరు అంటున్నారు.












Click it and Unblock the Notifications